ఇప్పుడు ఆంధ్రాలో దీక్షల కాలం నడుస్తోంది. కానీ దీక్ష చేయడం అంత వీజీ వ్యవహారం కాదండోయ్.. గుంటూరు జిల్లాలో నిరసన దీక్ష చేయడానికి జగన్ కు ఎంత ఖర్చయిందో కూడా తెలియ లేదట. ముందు ఒకసారి పర్మిషన్ అడిగి.. దీక్షాస్థలం సిద్ధం చేసుకుని.. పాంప్లెట్లు పంచి.. తీరా దీక్షకు ఎక్కేముందు అనుమతి లేదు పొమ్మనడం జగన్ కు నిజంగానే కోపం తెప్పించింది.

ఆ కోపం కాస్తా ప్రభుత్వంపై విమర్శల రూపంలో బయటకు వచ్చింది. ఇప్పుడు ఏపీ ఇంకో దీక్ష కూడా క్రమంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. జగన్ దీక్షను వైసీపీ దీక్షగా భావిస్తే.. ఈ కొత్త దీక్షను ఓ దళిత నాయకుడు తన అనుచరులతో కలసి చేపట్టాలని ఫీలవుతున్నారు. అందులోనూ ఈ దీక్ష ఏకంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా తుళ్లూరులోనే నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. 

ఐతే.. రాజధాని ప్రాంతంలో ఇప్పుడంతా అమరావతి శంకుస్థాపన హడావిడి నడుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ నిరాహారదీక్షకు అనుమతి ఇస్తారా.. ససేమిరా ఇవ్వరు. ఇవ్వరు గాక ఇవ్వరు.. గుంటూరు  జిల్లా తుళ్లూరు మండలం మైలవరంలో సామూహిక నిరాహార దీక్షకు అనుమతించలేమని దళిత నాయకుడు నాగయ్య మాదిగకు హైకోర్టు తేల్చి చెప్పేసింది. 

సామూహిక నిరాహార దీక్ష నిర్వహించుకోడానికి పర్మిషన్ ఇవ్వాలని గుంటూరు రూరల్  ఎస్పీని ఆదేశించేలా ఉత్తర్వులు ఇవ్వాలని నాగయ్య మాదిగ హైకోర్టుకెక్కారు. ఈ కేసుపై ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్ బి.భోసలే, జస్టిస్‌ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  భద్రతా కారణాల వల్ల దీక్షకు అనుమతి ఇవ్వలేమని ఇప్పటికే ఆంధ్రా హోంశాఖ చెప్పేసింది. కోర్టు కూడా అదే వాదనతో ఏకీభవించి.. అమరావతి చుట్టుపక్కల కాకుండా వేరే ఎక్కడైనా ట్రై చేసుకోవాలని సూచించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: