సాధారణంగా.. వామపక్షాలు నిమ్న వర్గాలకు అనుకూలంగా ఉంటాయి. భాజపా అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉంటుంది... అని జనంలో ఒక అపోహ ఉంటుంది. అలాగే రిజర్వేషన్ల వ్యవస్థ అనేది.. కేవలం నిమ్నవర్గాలు బీసీలు, ఎస్సీల కోసం మాత్రమే తీసుకువచ్చిన విధానం అని.. ఆ వ్యవస్థలో ఎవరు లోపాలు ఎత్తి చూపించినా సరే. ఆ వ్యవస్థలో మార్పులు కోరినా సరే.. వారు జాతి వ్యతిరేకులని, బలహీనవర్గాలను అణిచివేయడానికి చూసేవారని విమర్శలు వెల్లువెత్తించేస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో మన దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ గురించి.. ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు దుమారం లేపుతున్నాయి. వాటి నేపథ్యంలో అగ్రవర్ణాలంతా.. అంబేద్కర్‌ 'పదేళ్లు మాత్రం రిజర్వేషన్లు ఉంటే చాలు' అన్నారనే వాదనను.. బీసీలు, ఎస్సీలంతా.. 'ఎప్పటికీ రిజర్వేషన్లు ఉండాలనే' వాదనను, తటస్తులు అనదగిన మరో వర్గం క్రీమీలేయర్‌ను రిజర్వేషన్లను రద్దుచేసే మధ్యేమార్గం ఉండాలనే వాదనను తెరపైకి తెస్తున్నారు. 


మరోవైపు మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధంలేదని చాటుకోవడానికి తద్వారా దళిత ఓటు బ్యాంకు దెబ్బతినకుండా కాపాడుకోవడానికి అధికార మోడీ పార్టీ.. నానా పాట్లు పడుతున్నది. 


ఇవన్నీ ఒక ఎత్తు కాగా.. రిజర్వేషన్ల విషయానికి వస్తే.. వాటి విషయంలో ఈ దేశంలో పునరాలోచన అవసరం అనే వాదనకు వామపక్షాలు కూడా జై కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. సీపీఎం కీలక నాయకుడు సీతారాం యేచూరి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒకవైపు ఆరెస్సెస్‌ వ్యాఖ్యలను తమ భావజాలం పరంగా ఖండిస్తూనే.. ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను సమీక్షించాలనే వాదనను తెరపైకి తెచ్చారు. రిజర్వేషన్లను సమీక్షించడం అంటూ దానికి ఏరకమైన మేధావులతో ఒక కమిటీని ఏర్పాటుచేసినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో మార్పులు తప్పవని.. ఏవో కొన్ని సూచించడం ఖరారు. అసలే క్రీమీలేయర్‌ను తొలగించాలనే వాదనకు రానురాను బలం పెరుగుతోంది. ఏ రకంగా దీన్ని సమీక్షించడానికి పూనుకున్నప్పటికీ.. అది చుట్టుతిరిగి మోహన్‌ భగవత్‌ వాదనకు మద్దతిచ్చినట్లే పరిస్థితి తయారవుతుంది. 


ఆరెస్సెస్‌ అంటేనే వామపక్షాల వారికి ఉప్పునిప్పులా వైరం ఉంటుంది. తమ తమ సిద్ధాంతాలు భావజాలాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆరెస్సెస్‌ చెప్పే ప్రతిమాటను వీరు ఖండిస్తుంటారు. అలాంటిది ఈ విషయంలో.. సీపీఎం నాయకుడు.. వారి వాదనకే జైకొట్టడం అంటే ఎవ్వరికైనా ఆసక్తి కలిగించే అంశమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: