బీహార్‌ ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడుతోంది. క్రమక్రమంగా వేడెక్కుతోంది. అయితే ఇక్కడ ఎన్నికల ప్రచార వాతావరణంలో ఒక ప్రధానమైన ట్విస్టు కనపడుతోంది. లౌకిక కూటమికి చెందిన పార్టీలన్నీ కూడా.. తమ ప్రధాన ప్రత్యర్థి భాజపాను, ప్రధాని నరేంద్రమోడీని, వారితో జట్టు కట్టిన మాంఝీ, పాశ్వాన్‌లను ఇష్టారాజ్యంగా చీల్చిచెండాడేస్తున్నాయి. అదే సమయంలో.. భాజపా కూటమి.. వీరిమీద ఎదురుదాడులు చేయడంలలో కాస్త ఇబ్బంది పడుతోంది. ఆ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ లౌకిక కూటమికి ఒక పెద్ద కవచంలాగా ఉపయోగపడుతున్నారు. ఆ కవచాన్ని ఛేదించుకుని.. మహాకూటమిని గాయపరిచేలా విమర్శనాస్త్రాలను సంధించడం భాజపా వర్గాలకు చేతకావడం లేదు. 


మరో రకంగా చెప్పాలంటే.. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను పల్లెత్తు మాట అనడానికి కూడా భాజపా సాహసించలేకపోతున్నది. ప్రధానిగా నరేంద్రమోడీ ప్రజల మనస్సుల్లో నిజంగా సంపాదించుకున్న కీర్తి ఎంతో, ప్రచారం చేసుకుంటున్నది ఎంతో మనకు క్లారిటీ లేదు గానీ.. బీహారీలకు కాస్త స్వచ్ఛమైన పాలన అందిస్తూ వారి దృష్టిలో నితీశ్‌కుమార్‌ సంపాదించకున్న మంచిపేరు చాలానే ఉంది. 


సాధారణంగా ప్రభుత్వం దుర్మార్గాల మీద ఎన్నికల ప్రచారంలో విరుచుకుపడితే తప్ప ప్రతిపక్షాలు నాలుగు ఓట్లు రాలుతాయనే నమ్మకం ఉండదు. అయితే బీహార్లో ప్రత్యేకించి.. భాజపా తమ ప్రచారంలో నితీశ్‌ సర్కారును తూలనాడలేకపోతోంది. నితీశ్‌ను తిడితే ఆ దుష్ప్రచారం బ్యాక్‌ఫైర్‌ అయి తమకే నష్టం కలిగిస్తుందేమోనన్న శంక ఒకవైపు వారిని వెన్నాడుతోంది. 
అందుకే భాజపా ప్రచారాన్ని మనం కాస్త లోతుగా గమనిస్తే గనుక.. వారు నితీశ్‌ను పల్లెత్తు మాట అనకుండా.. ఆయన కూటమిలో ఉన్న ఇతర పార్టీలు, నేతలు అవినీతి పరులు, జంగల్‌రాజ్‌ను అందిస్తారు, రాక్షసులు అంటూ తూలనాడుతున్నారు. ఈ పదాలను నితీశ్‌ మీద ప్రయోగించడానికి వారికి ధైర్యం చాలడం లేదు. లాలూతో నితీశ్‌ జట్టుకట్టడమే అవకాశవాదం అనీ.. అది కలకాలం నిలిచేది కాదని అంటున్నారే తప్ప.. లాలూ లాగే నితీశ్‌ కూడా ప్రజలకు ద్రోహం చేస్తాడని నిందించలేకపోతున్నారు. చెడ్డవాడైన లాలూ దర్శకుడిలా ఉంటే.. నితీశ్‌ నటుడిలా చేయాల్సిందేనని, లాలూ చేతిలో నితీశ్‌ కీలుబొమ్మ అని అనగలుగుతున్నారే తప్ప.. నితీశ్‌ కూడా చెడ్డవాడు అనడం లేదు. 


ఈ తరహా విమర్శలు కాస్త లోతుగా గమనిస్తున్న వారికి ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు తమ ప్రధాన ప్రత్యర్థిని నిశితంగా విమర్శించకుండానే.. ఎన్నికల్లో నెగవచ్చునని ఎన్డీయే లేదా వారి సారధి పార్టీ భాజపా ఎలా తలపోస్తున్నదో అర్థం కావడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: