ప్రధాని నరేంద్రమోడీ చాలా గొప్ప వక్త. తన భాషా విన్యాసాలు, హావభావ ప్రకటనలతో ఆయన ప్రతి ప్రసంగాన్ని రక్తి కట్టించేలా, సభికులను సమ్మోహన పరచేలా.. అద్భుతంగా చేయగలరు. ఆయన సామాన్య జనం ముందు బహిరంగ సభలో మాట్లాడినా.. ఫక్తు కార్పొరేట్‌ పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాల సమావేశాల్లో మాట్లాడినా ఏ వేదికకు అనుగుణంగా తన భాషను, ఆహార్యాన్ని, వేషాన్ని, వాడే పదజాలాన్ని అన్నిటినీ మార్చేసుకుంటూ.. వారిని మంత్రముగ్ధం చేయడం ఆయనకు అలవాటైపోయింది. ప్రత్యేకించి.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించే సమయంలో.. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాషల్లో కొంత మాట్లాడడం అనేది ఆయన ప్రయోగించే మరో టెక్నిక్‌. నిజానికి చాలా మంది నాయకులు ఈ టెక్నిక్‌ను ఒకటిరెండు పదాలకు పరిమితం చేస్తుంటారు. సోనియా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినా.. 'నమస్తే' అనే ప్రారంభిస్తారు. 


అయితే ఎంతైనా మోడీ రూటు కాస్త సెపరేటు. ఆయన ప్రస్తుతం.. బీహార్‌ ఎన్నికల్లో చాలా ముమ్మరంగా పాల్గొనే ఉద్దేశంతో ఉన్నారు. మొత్తం అయిదు విడతలుగ జరిగే బీహార ఎన్నికల్లో మోడీ దాదాపు పదిరోజుల పాటూ ఆ రాష్ట్రంలో సభల్లో ప్రసంగిస్తూనే ఉంటారని పార్టీ వ్యూహాలు చెబుతున్నాయి. 


అయితే ప్రస్తుతం ఈ బీహారీ ప్రసంగాలకు సంబంధించి మోడీ హోంవర్క్‌ ముమ్మరంగా చేస్తున్నారట. బీహారీ పదాలను నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారుట. నిజానికి మన దక్షిణాది రాష్ట్రాల్లో అంటే సభలో హిందీ మాట్లాడుతూ ఒక అనువాదకుడిని పెట్టుకోవాలి గానీ.. బీహార్లో హిందీ ప్రసంగం బాగానే చెల్లుబాటు అవుతుంది. అయినా సరే.. సదరు వీలైనన్ని ఎక్కువ బీహారీ పదాలు వాడితే ప్రజలకు దగ్గరైనట్లుగా ఉంటుందని ఆయన ఇలా ప్లాన్‌ చేస్తున్నారట. కేవలం కొన్ని పదాలు మాత్రమే కాదు. బీహారీ భాషలో ఉండే కొన్ని లోకల్‌, ప్రత్యేకమైన సామెతలు వంటివి కూడా సాధన చేస్తున్నారట. సాధారణంగా తన ప్రసంగానిన జాతీయాలు, సామెతలతో నిండుగా, సొగసుగా తయారుచేసుకుని మాట్లాడే మోడీ.. ఇప్పుడు బీహారీ భాషను కూడా ఔపోసన పట్టి.. స్థానికులను అలరించడానికి పూనుకుంటున్నారు. మరి ఆయన కష్టానికి ఫలితం ఏమేరకు దక్కుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: