రైతు ఆత్మహత్యల దుర్ఘటనల రెండు తెలుగు రాష్ట్రాలను ఏ స్థాయిలో కుదిపేస్తూ ఉన్నాయో ప్రతిరోజూ వార్తా మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాం. ఎక్స్‌గ్రేషియా పెద్దమొత్తాల్లో ఇచ్చి మరణించిన వారి కుటుంబసభ్యుల కన్నీళ్లను కొంత తగ్గించడనికి ప్రయత్నం తప్ప.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని అడ్డుకోవడానికి గానీ.. జరగకుండా చూడడానికి గానీ ఏమీ చేయలేకపోతున్నాయి. ఇది చాలా శోచనీయం. 


అయితే మరో దారుణం ఏమిటంటే.. ఆత్మహత్యలు చేసుకుంటున్న అందరు రైతులూ ఎదుర్కొంటున్నది ఒకే తరహా పరిస్థితులు కాదు. వేర్వేరు నేపథ్యాలు వారిని చావులవైపుగా పురిగొల్పుతున్నాయి. ఏ ఇద్దరి ఆత్మహత్యల కారణాలు పూర్తిగా ఒకేరీతిగా ఉండవు. రకరకాల పరిస్థితులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒక తరహా చర్యలు అందరి చావులకు పరిష్కారం కాగలవని అనుకోలేము. అలాగని ప్రభుత్వాలు ఏమీ చేయకుండా ఉండడం కూడా సరికాదు. 


ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో కరవు మండలాలను ప్రకటించడం అనేది రైతుల పరిస్థితులను మెరుగుపరచడానికి కొంత ఉపకరిస్తుందనే వాదన కూడా ఉంది. మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీలో కూడా.. విపక్షాల సభ్యులందరూ కూడా కరవు మండలాల గురించిన ప్రకటన చేయడమూ, కేంద్రానికి సిఫారసులు పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదంటూ తీవ్రస్థాయిలో విరుచకుపడ్డారు. ఆ తర్వాతి పరిణామాల్లో సభ్యులందరినీ సస్పెండ్‌ చేయడానికి సాహసించిన ప్రభుత్వం.. సమాంతరంగా కరవు మండలాల అధ్యయనాన్ని మాత్రం ఇప్పటికీ పూర్తిచేయలేకపోతోంది. కేంద్రంనుంచి అదనంగా కొన్ని నిధులు, కొన్ని మినహాయింపులు, రుణాల దిశగా ప్రత్యేకవసతులు వచ్చే నేపథ్యంలో... కరవు మండలాల ప్రకటన అనేది చాలా కీలకమైనది. అయినా సరే తెలంగాణ సర్కారులో కదలిక రావడం లేదు. 


ఒకవైపు ఏపీలో ఆ పర్వాన్ని పూర్తి చేశారు. చంద్రబాబునాయుడు సర్కారు 199 మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించి కేంద్రానికి జాబితా కూడా పంపించారు. అయితే.. తెలంగాణలో మాత్రం ఇప్పటికీ వ్యవహారం ఒక కొలిక్కి రావడం లేదు. కరవు మండలాల ఎంపిక, ప్రకటన వలన రైతులోకానికి ఎంతో కొంత మేలు జరగడం మాత్రం గ్యారంటీ. పైగా దానివలన రాష్ట్ర సర్కారుమీద తక్షణం పడే భారం పెద్దగా ఉండదు కూడా. అయితే ఆ దిశగా ప్రభుత్వంలో ఎందుకు కదలిక రావడం లేదన్నది మాత్రం బోధపడడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: