ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా గురించి విపక్షాలు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతగానితనాన్ని, బలహీనతను కప్పిపుచ్చుకొనేందుకు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను అమ్మేశారని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. పైగా చంద్రబాబునాయుడు తీరు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నదంటూ సురవరం సుధాకరరెడ్డి ఆరోపణలు గుప్పించడం విశేషం.


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంపూర్ణ మద్దతు తెలియజేసారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రత్యేక హోదా గురించి తీరును తీవ్రంగా ఆక్షేపించారు.  విపక్షాలన్నీ ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనలు చేస్తూంటే అధికార పక్షాలైన తెదేపా, భాజపాలు ఏ మాత్రం స్పందించకపోవడం, చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా అనేది సంజీవని కాదు అని వాదించడాన్ని తప్పు పట్టారు. గత నెల జగన్మోహన్ రెడ్డి గుంటూరులో దీక్ష తలపెట్టినప్పుడు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రికి ఆమరణ దీక్షకు, నిరవధిక దీక్షకు తేడా తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు పూర్తిగా ఒక నియంత లాగా వ్యవహరిస్తున్నారని, ఆయన తన నియంతృత్వ ధోరణిని, ఒంటెత్తు పోకడలను మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు.


ఏది ఏమైనా ప్రత్యేక హోదా గురించి విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లే కనపడుతున్నాయి. కానీ.. ఇలాంటి ఐక్యత కేంద్రం మెడలు వంచడానికి సరిపోదని పలువురు భావిస్తున్నారు. జగన్ దీక్ష చేస్తోంటే.. సీపీఎం మద్దతివ్వడమూ, మరో రీతిగా బలపరచడమూ కాదు కావాల్సింది.. అందరూ కలసి ఒక వేదిక మీదికి చేరి పోరాడాలి. ఎటూ అధికార తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని పట్టించుకోదు గనుక.. ప్రతిపక్షాలే ఒక తాటిపైకి రావాలి. ఎవరికి వారు పొలిటికల్ మైలేజీ కోసం ఆశ పడకుండా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం గళం కలిపితేనే అది సాధ్యం అవుతుంది.


కేంద్రం మెడలు వంచడం సంగతి రెండో దశ.. అలా అన్ని పార్టీలు ఐక్యంగా పోరాటానికి దిగితే గనుక.. ముఖ్యమంత్రి చంద్రబాబులోనూ కాస్త భయం కలిగి, కదలిక వచ్చి.. అందరితో పాటూ తాము కూడా కలుస్తూ ఓ అఖిలపక్షం ఏర్పాటు చేయవచ్చునని కొందరి ఆశ. నిజానికి తెదేపాలోని అశోక్ గజపతి రాజు వంటి సీనియర్ నాయకులు ఇదే డిమాండ్ చేస్తున్నారు. అన్ని పార్టీలు కలిసి పోరాడితే.. హోదా తప్పక వస్తుందంటున్నారు. మరి సురవరం అన్నట్లుగా చంద్రబాబు నియంతలా చేయడం కాకపోతే.. తమ సొంత పార్టీ పెద్దలు చెప్పే మాటల్ని కూడా ఆయన చెవిన వేసుకోకుంటే.. ఈ రాష్ట్రం ఏ గతిన బాగుపడేను.


మరింత సమాచారం తెలుసుకోండి: