పోలవరం.. నవ్యాంధ్రలో ఈ ప్రాజెక్టు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. వృథాగా గోదారవరిలో కలసిపోయే దాదాపు 200 టీఎంసీలను సద్వినియోగం చేసుకునే మహత్తర అవకాశం దీని వల్ల కలుగుతుంది. అటు విశాఖ నుంచి ఇటు సీమ వరకూ అందరి జల అవసరాలు తీర్చగల మహత్తర పథకం. ఇది పూర్తయితే నవ్యాంధ్ర చరిత్రలో అదో మైలురాయే. 

ఐతే.. రాజధాని, పట్టిసీమ ప్రాజెక్టు వంటి విషయాల్లో జెట్ స్పీడుతో దూసుకుపోతున్న చంద్రబాబు సర్కారు పోలవరం సంగతి మాత్రం పట్టించుకోవడం లేదా.. తల్లి లాంటి పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి పిల్ల లాంటి పట్టిసీమ వెంట పరుగులు తీస్తుందా.. అన్న అనుమానాలు కొంత కాలంగా విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు పోలవరం పూర్తయితే పట్టిసీమ కు పెట్టిన ఖర్చు వృథా అవుతుందని.. ఆ ఖర్చు నేరుగా పోలవరానికే పెట్టాలని అవి డిమాండ్ చేశాయి. 

నదుల అనుసంధాన కర్తగా కీర్తించపబడుతున్న చంద్రబాబు పోలవరం విషయంలో మాత్రం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారంటున్న విపక్షాల విమర్శలకు ఇప్పుడొక అదనపు బలం చేకూరింది. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఇన్ ఛార్జ్ పురందేశ్వరి పోలవరం విషయంలో రాష్ట్రం నుంచే ఆలస్యం జరుగుతోందని విమర్శించారు. 

గుంటూరు జిల్లా చిలకలూరి పేట వద్ద పార్టీ శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరంపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపించడం లేదని...  అందువల్లనే నిధుల విడుదల కూడా ఆలస్యం అవుతోందని పురందేశ్వరి అంటున్నారు. ప్రత్యేక హోదా రాకపోయినా, రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిదులు ఇస్తోందని ఆమె అన్నారు. ఏదేమైనా ఇలాంటి విమర్శలు చంద్రబాబు పేరును దెబ్బ తీసేవే..!


మరింత సమాచారం తెలుసుకోండి: