కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆ తరువాత రెండు రాష్ట్రాలకు కీలక పరిశీలకుడిగా ఉంటూ.. తరచూ హైదరాబాదు వస్తూ ఉండిన డిగ్గీరాజాకు ప్రతిసారీ ఒక ఘనస్వాగతం ఎదురవుతూ ఉండేది. డిగ్గీరాజా శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ప్రతిసారీ.. భాగ్యనగరం కాంగ్రెస్‌ కీలక నాయకుడు అప్పటి మంత్రి దానం నాగేందర్‌ స్వయంగా వెళ్లి స్వాగతం పలికి, పూలమాల వేసి ఆహ్వానించేవారు. డిగ్గీరాజాతో దానంకు అంత దగ్గరి అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఆయనకు మేలు చేసింది కూడా..! అయితే సదరు 'దానం'తో అనుబంధం వలన ఇప్పుడు అదే డిగ్గీ రాజా ఓ కీలక బాధ్యత నెత్తికెత్తుకోవాల్సి వచ్చింది. దానం నాగేందర్‌ పార్టీ వీడిపోతున్నాడనే ప్రచారం ముమ్మరంగా జరుగుతూ ఉండగా... ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించకముందే బుజ్జగించి... జోకొట్టడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి ఫోను చేసి దానం నాగేందర్‌తో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. 


దానం నాగేందర్‌ చాలా కాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయినా సరే కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటి నిత్య అసంతృప్తులు మామూలే అని అందరూ తేలిగ్గా తీసుకుంటూనే ఉన్నారు. అయితే నాగం త్వరలో తెరాస తీర్థం పుచ్చుకుంటారని వార్తలు రావడంతో.. డిగ్గీరాజా రంగంలోకి దిగారు. ఆయన ఫోనులో మాట్లాడి.. పార్టీ వీడి వెళ్లవద్దంటూ దానం ను కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. తనకు అలాంటి ఉద్దేశం లేదని... తన మీద జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని దానం , దిగ్విజయ్‌తో స్పష్టం చేశారుట. 


కాకపోతే పనిలో పనిగా అధిష్ఠానం నేత స్వయంగా ఫోను చేశారు గనుక.. పార్టీలో చాలాకాలంగా తనకు అన్యాయం జరుగుతున్నదని కూడా నాగేందర్‌ ఆయనకు చెప్పారుట. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్టీ పరిధి, ప్రాధాన్యం తగ్గుతున్నదంటూ నాగేందర్‌ డిగ్గీకి చెప్పినట్లు సమాచారం. పరిస్థితులు నెమ్మదిగా సెట్‌ అవుతాయని ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని దిగ్విజయ్‌ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: