తెలుగుదేశం పార్టీనుంచి ఒక్క గెంతు గెంతి ఏకంగా టీఆరెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి కొట్టివేసి చాలామందికి ఈర్ష్య కలిగించిన తలసాని యాదవ్ అసలుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామానే చేయలేదట. టీఆరెస్‌లో చేరకముందు టీడీపీ ఎమ్మెల్యేగా సనత్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచిన తలసాని ఇక చంద్రబాబును నమ్ముకుంటే లాభం లేదని గ్రహించి ఒక ఫైన్ డే శుభ్రంగా పంచ దులుపుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని కౌగలించుకున్నారు. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆక్షేపణ, మీడియా ప్రశ్నల నుంచి తప్పుకోవడానికి తాను రాజీనామా చేసి మరీ పార్టీ మారుతున్నానని డాంబికంగా ప్రకటించారాయన. తీరా చూస్తే తన ఎమ్మెల్యే స్థానానికి అసలు రాజీనామాయే చేయలేదట.


సాక్షాత్తూ తెలంగాణ హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి పై ప్రకటన చేయడంతో విస్తుపోవడం మీడియా వంతైంది. తలసాని రాజీనామా చేసిన సనత్ నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తున్నారని మీడియా ప్రశ్నించగా నాయని అసలు నిజం గుట్టు విప్పారు. తలసాని ఇంకా తన సీటుకు రాజీనామాయే చేయలేదు ఇకెక్కడి ఎన్నికలు అంటూ తోసిపుచ్చారు నాయని.


తలసాని టీఆరెస్‌లో చేరడమే కాకుండా మంత్రిపదవి కూడా చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని తెలుగుదేశం పార్టీ మొదటినుంచి వీధులకెక్కింది. చివరకు హైకోర్టు  గడప తొక్కి కూడా ఫలితం లేకపోయింది ఆ పార్టీకి.  తలసాని నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత  మర్రి శశిధరరెడ్డి కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవడంతో.. ఆయన పలుమార్లు రాష్ట్రపతిని, ఎన్నికల సంఘాన్ని, గవర్నరును కలిసి కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఆయనకు కూడా ఉపయోగం మాత్రం కనిపించలేదు. ఈ ఒక్క తలసాని విషయంలో మాత్రం రెండు పార్టీల వారు ఉమ్మడిగా పోరాటం ప్రారంభించినప్పటికీ.. అధికార తెరాస ఏమాత్రం ఖాతరు చేయకపోవడంతో ఉపయోగం కనపళ్లేదు.  ఇప్పుడు నాయని స్వయంగా తలసాని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వలేదనటంతో మరోసారి టీటీడీపీ, తెరాస మధ్య ఘర్షణ తప్పదనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: