అమరావతికీ, రాజమౌళికి లింకేంటని ఆశ్చర్యపోతున్నారా.. లేకపోతే మాహిష్మతి రాజ్యంగా రాజమౌళి కూడా మరో రాజ్యాన్ని సృష్టించబోతున్నాడని ఊహిస్తున్నారా.. అలాంటిదేమీ లేదు కానీ.. ఏపీ సీఎం కలలుగంటున్న అంతర్జాతీయ నగరం అమరావతి ప్రమోషన్ వర్క్ లో భాగంగా రాజమౌళి క్రియేటివిటీని కూడా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట.

అమరావతి శంకుస్థాపనను న భూతో.. న భవిష్యతి.. అన్న రేంజ్ లో నిర్వహించాలని చంద్రబాబు కలకంటున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 జరగనున్న ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐతే.. ఈ కార్యక్రమానికి సినీ హంగులు కూడా తోడైతే ఈవెంట్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అందుకే రాజమౌళి వంటి దర్శకుల సేవలు కూడా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారట. 

ఇప్పటికే రాజమండ్రి పుష్కరాల నిర్వహణ విషయంలో దర్శకుడు బోయపాటి శ్రీను సేవలను ఉపయోగించుకున్నారు. ప్రత్యేకించి గోదావరి హారతి కార్యక్రమాన్ని బోయపాటి నిర్వహించిన తీరు చంద్రబాబుకు బాగా నచ్చింది. అందుకే అమరావతి ఈవెంట్ లోనూ సినీ సేవలు వాడుకోవాలనుకుంటున్నారు. బోయపాటి శ్రీను, రాజమౌళి, తోట తరణి వంటి దర్శకుల, కళాదర్శకుల సేవలు వాడుకోవాలని చంద్రబాబు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు పాస్ చేశారట. 

అంతేకాదు.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణలో కొంతభాగాన్ని చంద్రబాబు సినీ నిర్మాత సి.అశ్వినీదత్ కు అప్పగించారట. ఆయన ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయట. ప్రత్యేకించి అమరావతిపై మూడు గీతాలు రూపొందించబోతున్నారట. మరి అమరావతి శంకుస్థాపనకు ఈ సినీ హంగులు ఏమేరకు ఉపయోగపడతాయో..!



మరింత సమాచారం తెలుసుకోండి: