ఆంధ్రా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పర్సనల్ కెమేరామెన్ భార్య హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మరిపిస్తోంది. జగన్ పర్సనల్ కెమేరామెన్ వంశీకృష్ణ.. వరలక్ష్మీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరి కులాలు వేరుకావడంతో వంశీ కుటుంబీకులు మొదటి నుంచీ ఈ పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు. 

అత్తింటివారి వ్యతిరేకత మధ్యనే వరలక్ష్మి భర్త స్వగ్రామమైన నాగాయలంక మండలం బర్రంకులకు కాపురానికి వెళ్లింది. వంశీ ఉద్యోగం రీత్యా ఈ జంట హైదరాబాద్ లోనే ఉండేవారు.. మొదటి నుంచి ముడు గొడవలు..ఆరు వేధింపులు అన్నట్టుగానే ఆమె కాపురం సాగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన వరలక్ష్మి.. భర్త స్వగ్రామానికి బిడ్డతో వచ్చిన సమయంలో.. ఉన్నట్టుండి ఈ జూలైలో...ఓ రోజు అదృశ్యమైంది.

కోడలి అదృశ్యంపై ఆమె మామ బ్రహ్మనాగేశ్వరరావు జూలై 4న నాగాయలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎంతవెదికినా దొరకకపోవడంతో పోలీసుల అనుమానం అత్తమామలపైకే వెళ్లింది. ప్రేమ వివాహం నేపథ్యంలో బ్రహ్మనాగేశ్వరరావును విచారిస్తే.. తానే కోడలిని చంపినట్టు ఒప్పుకున్నాడు. తనకు నచ్చని వివాహం చేసుకున్నందువల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు  ఆయన అంగీకరించాడు. 

కోడల్ని హత్య చేసిన బ్రహ్మనాగేశ్వరరావు.. ఆమె డెడ్ బాడీని ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని పంటపొలాల సమీపంలోని ఓ కాల్వలో పాతి పెట్టారు. ఆయన చెప్పిన వివరాలను బట్టి వరలక్ష్మి మృతదేహాన్ని వెలికి తీశారు. కేవలం ఎముకలు, వెంట్రుకలు మాత్రమే లభించాయి. ఐతే.. వరలక్ష్మి హత్యకేసులో ఆమె భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని అంటున్నారు. జగన్ కున్న రాజకీయ పలుకుబడి కారణంగానే అతన్ని కాపాడుతున్నారని ఆరోపిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: