భారత దేశంలో రోజు రోజుకి మహిళలపై, యువతులపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇక చట్టాలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నాం అంటారే తప్ప ఎక్కడా ఇలాంటి వాటిని నివారించిన దాఖలాలు లేవు. అత్యాచారానికి పాల్పడటం, ఆడవారిని ఇబ్బంది పెట్టిన వారిపై ‘నిర్భయ’ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. అయినా కొందరు కామాందులు మహిళలపై రెచ్చిపోతూనే ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి నగరాల్లో అత్యాచారాల పర్వం మరీ దారుణమైంది. తాజాగా కర్ణాటక హోం మంత్రి కేజే జార్జ్ అత్యాచారాలపై సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్య పర్చారు.

ఇప్పటికే బెంగళూరులో వరుసగా వెలుగుచూస్తున్న అత్యాచారాల నేపథ్యంలో సిద్ధరామయ్య సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ విమర్శలకు మరింత ఆజ్యం పోసేలా జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అగ్గికి ఆజ్యం పోశాడు. బెంగళూరులో రెండు రోజుల క్రితం నిర్భయ ఘటనలా ఓ బీపీవో ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపై గురువారం పోలీసులతో సమీక్ష నిర్వహించిన అనంతరం జార్జ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరే మగవాళ్లు చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదని ఆయన అన్నారు. కనీసం నలుగురైదుగురు కలిసి చేస్తేనే దాన్ని గ్యాంగ్ రేప్ అనాలి తప్ప, ఇద్దరు చేస్తే అది ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

ఈ మద్య 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిని ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి కదులుతున్న వ్యానులో అత్యాచారం చేసిన ఘటనపై మీడియా ప్రతినిధులు ఆయన స్పందన కోరినప్పుడు జార్జి ఇలా వ్యాఖ్యానించారు.నలుగురికి మించితేనే అది సామూహిక అత్యాచారం కిందకు వస్తుందని బెంగళూరులో మహిళలపై అఘాయిత్యాల నివారణకు తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వంతో పాటు ఆయా కంపెనీలు కూడా ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని జార్జ్ సూచించారు. కాగా జార్జ్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: