భాజపా అంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారం వెలగబెడుతున్న తెలుగుదేశం పార్టీకి వారు మిత్రపక్షమే. అధికారంలో భాగస్వామిపార్టీ కూడా! అయితే ఆ పార్టీ నాయకులు రెండో రోజులుగా వేర్వేరు సందర్భాల్లో పోలవరం డ్యాం నిర్మాణం గురించి పదేపదే ప్రస్తావిస్తూ ఉండడం, దానికి సంబంధించి చంద్రబాబునాయుడు అలసత్వమే ప్రధాన లోపం అంటూ.. ఆయన మీద సూటిగా విమర్శలు గుప్పిస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చంద్రబాబునాయుడు భాజపా కు చెందిన నాయకుల్ని పల్లెత్తు మాట అనాలంటే కంగారెత్తి పోతుంటారు. కానీ భాజపా నాయకులు మాత్రం.. ఆయన తీరును సూటిగా ఎండగట్టడంలో మర్మం ఏంటో తెలియడం లేదు. 


వివరాల్లోకి వెళితే. పోలవరం ప్రాజెక్టు అనుకున్నదానికంటె చాలా ఆలస్యంగా నడుస్తున్న మాట వాస్తవం. ఇది జాతీయ ప్రాజెక్టు గనుక.. కేంద్రం కేటాయించే నిధులతోనే ఇక్కడ పనులు జరగాలి. కేంద్రం నిధులు సక్రమంగా విడుదల చేయడం లేదని, ముష్టి విదిలించినట్లుగాట విడతలుగా నిధులు ఇస్తుండడం వల్ల.. పనులు జాప్యం అవుతున్నాయని పలువురు భావిస్తూ ఉన్నారు. చంద్రబాబు కేంద్రాన్ని నిధులు వేగిరం ఇవ్వాలని అడగలేని స్థితిలో ఉన్నారని కూడా ఆయన ప్రత్యర్థులు దుమ్మెత్తిపోస్తున్నారు. 


కాగా, చంద్రబాబునాయుడు ప్రభుత్వమే పోలవరం జాప్యానికి కారణం అంటూ.. భాజపా నాయకులు విరుచుకుపడుతున్నారు. ఆపార్టీ అధ్యక్షుడు కావచ్చునని భావిస్తున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు గానీ, మరోవైపు మహిళా భాజపా నాయకురాలు పురందేశ్వరి గానీ.. ఈ కోణంలోంచి చంద్రబాబుపై విమర్శలు సంధించారు. సోము వీర్రాజు అయితే.. పట్టిసీమకు పోలవరానికి సంబంధం లేదని.. అది పోలవరం లో భాగమే అంటూ.. పోలవరం కోసం కేంద్రంనుంచి నిధులు తెచ్చుకుని వాటిని పట్టిసీమకు ఖర్చు చేస్తున్నారంటూ.. చంద్రబాబు మోసం చేస్తున్నాడనే రేంజిలో బాణాలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు తాను పోలవరానికి ఖర్చు చేశానని చెబుతున్న సొమ్ముకు అఫిడవిట్లు సమర్పిస్తే తప్ప కేంద్రం నుంచి నిధులురావని.. తానే ఆర్థిక మంత్రి అయినంత రేంజిలో మరోవైపు పురందేశ్వరికూడా రెచ్చిపోతున్నారు. 


ఇలా భాజపా నాయకులంతా ఏక కాలంలో చంద్రబాబు మీద.. విమర్శలు ఎక్కుపెట్టడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉన్నదా అని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో తాము బలపడిపోయి.. తెదేపాతో సంబంధం లేకుండాసొంతంగా పోటీ చేయాలనే కోరిక ఆ పార్టీలో బలంగా ఉన్నమాట వాస్తవం. కానీ.. ఇప్పటినుంచే చంద్రబాబును ఇలా తూలనాడుతూ ఉండాలా? అనేది చాలా మందికి సందేహంగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: