తెలంగాణలో భూతంలా పట్టుకుని వేధిస్తున్న రైతు ఆత్మహత్యలకు మించిన చిక్కు సమస్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును ప్రస్తుతం చుట్టుకుంది. ఆంద్రప్రదేశ్ 
ప్రభుత్వం అమరావతిలో అక్టోబర్ 22న నిర్వహిస్తున్న చారిత్రాత్మక రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లాలా వద్దా అనే డైలెమ్మాలా కేసీఆర్ పడ్డారని బోగట్టా. 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో ఆయన ఇంకా స్పష్టమైన అవగాహనకు రాలేదని తెలుస్తోంది. 


ఇప్పటికే ఈ విషయమై కేసీఆర్ తన పార్టీ సీనియర్ సహచరులుతో చర్చించారని, కాని ఏపీ రాజధాని శంఖుస్థాపనకు కేసీఆర్ హాజరు విషయంలో సహచరులనుంచి 
మిశ్రమ స్పందన వచ్చిందని సమాచారం. కేసీఆర్ ఆ కార్యక్రమానికి వెళితేనే బాగుంటుందని, తాను ఆంధ్రప్రజలకు వ్యతిరేకిని కానని ఒక సందేశం 
ఇచ్చినట్లవుతుందని ఒక సెక్షన్ పార్టీ నేతలు అభిప్రాయం చెప్పారట. అయితే చంద్రబాబుతో ఉన్న బద్ధవిరోధం దృష్ట్యా కేసీఆర్ అక్కడికి వెళ్లకుంటేనే బాగుంటుందని 
మరో వర్గం నేతలు అభిప్రాయపడ్డారని తెలిసింది.


కేసీఆర్ నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు వెళతారా లేదా అనేది పక్కనబెట్టి చూస్తే ఆయన గత పదేళ్లుగా ఆంధ్ర ప్రాంతం ముఖం చూడలేదన్నది వాస్తవం. 
తెలుగుదేశంకి రాజీనామా ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పర్చి ఉద్యమ బాట పట్టిన కేసీఆర్ తెలంగాణ లోని సబ్బండవర్గాలను ప్రత్యేక తెలంగాణ 
ఏర్పాటువైపుగా ఐక్యపరచడానికి భాషనే ప్రధాన ఆయుధంగా ఎక్కుపెట్టి ఆంధ్ర పాలకవర్గాలపై గురిపెట్టారు. ప్రత్యేకించి తెలంగాణ ద్రోహిగా చంద్రబాబు నాయుడిని 
ప్రజల దృష్టిలో నిలపడంతో నూటికి నూరు శాతం విజయం సాధించారు కేసీఆర్. 


తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా ఆంధ్రా సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలుస్తున్నాడంటూ అనేక సభల్లో మండిపడ్డారాయన.  
వీటన్నిటికీ పరాకాష్టగా ఓటుకు నోటు కుంభకోణంలో తన ప్రభుత్వానికే ఎసరు తేవాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం ఈ ఇద్దరు సీఎంల మధ్య శాశ్వత విరోధాన్ని 
తెచ్చి పెట్టింది. ఏపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా దాదాపు 15 వేలమంది వీఐపీలను రాజధాని శంకుస్థాపనకు రావలసిందిగా ఆహ్వానం 
పలుకనుంది. పనిలో పనిగా పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కూడా సగౌరవంగానే ఆహ్వానం పంపే అవకాశాన్ని తోసిపుచ్చలేము. కానీ కేసీఆర్ తమ మధ్య 
ఇటీవలి ఘర్షణలను కూడా పక్కన బెట్టి అమరావతికి వెళతారంటే ఆయన మొండివైఖరిని చూసినవారికి నమ్మ బుద్ది వేయదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: