వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై పోరాటంలో అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు వ్యూహంలో ఇరుక్కుపోయారా? తాజా పరిణామాలు ఈ వ్యాఖ్యకు బలం చేకూరుస్తున్నాయి. నేను చనిపోతానో అంటూ రోడ్డుమీద ప్రకటిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? జగన్ ప్రత్యేక హోదాకోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తాడో చూస్తాం అంటూ పంతం పట్టి, ఢిల్లీలో ప్రకటించి మరీ సెప్టెంబర్ 26న జగన్ తలపెట్టిన నిరవధిక దీక్షను ముందురోజే భగ్నం చేసిన చంద్రబాబు ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లే వేసి జగన్‌ను అడ్డంగా ఇరికించిందా అనే విషయం అప్పుడు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది.


తెలుగు దేశం ప్రభుత్వం చాలా ప్లాన్డ్‌గా జగన్ని ముగ్గులో దింపినట్లు వస్తున్న ఆ వార్తల సారాంశం ఒకటే. జగన్ దీక్షకు కూర్చోవడానికి ముందు చంద్రబాబునాయుడు సమీక్షా సమావేశంలో ఆ దీక్షపై చర్చించారని, రాష్ట్ర పోలీసులు ఎవరూ ఆ దీక్షా స్థలం వైపుకు వెళ్లవద్దని ఆదేశించారని నెటిజన్లు గుసగులలాడుతున్నారు. ఆ ప్రకారమే పోలీసులు తన జోలికి రాకపోవడంతో జగన్ అనుమతి ఉన్నా లేకున్నా దీక్షా స్థలంలో కూర్చోగలిగారు. 


అక్టోబర్ 7న జగన్ ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లా నల్లపాడు రోడ్డులోని ప్రైవేట్ స్థలంలో తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులూ తలపెట్టకుండా ఊరకుండటంతో జగన్ గత మూడురోజులుగా దీక్షలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఏ మీడియా కూడా వైఎస్ జగన్ దీక్షకు పెద్దగా కవరేజ్ ఇవ్వకున్నా సాక్షి టీవీ, దినపత్రిక మాత్రం జగన్ దీక్షకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి ప్రచారం చేస్తున్నాయి. జగన్ ఎవరు, ప్రత్యేక హోదా అంటే ఏమిటి అనే చందాన ఆంద్రా మీడియా శీతకన్ను వేసినా జగన్ చలించకుండా దీక్షలో నిలబడటం ఆయనకు విశేష ప్రచారం తెచ్చిపెడుతోంది. జగన్‌ను కలిసి సంఘీభావం తెలుపుతున్న జన సందోహం ప్రభుత్వానికి కొత్త భయాలు కలిగించినట్లు తెలుస్తోంది.


మొదట్లో జగన్ ఎన్నిరోజులు దీక్షలో తిండిలేకుండా ఉంటాడో చూస్తాం అనే తెంపరితనంతో ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండిపోయింది. జనం వస్తారు. జగన్‌ను కలుస్తారు. ఓదార్చుతారు. తర్వాత వెళ్లిపోతారు అంతకుమించి మరేం జరుగుతుందో చూద్దాం అన్నంతవరకు ప్రభుత్వందే పైచేయిగా ఉండింది. కానీ త్వరలో అమరావతిలో జరగనున్న రాజధాని శంకుస్థాపన వరకు జగన్ దీక్ష కొనసాగిస్తే శంకుస్థాపన కార్యక్రమమే రసాభాస అవుతుందని ప్రభుత్వం డైలమ్మాలో పడినట్లు సమాచారం. వీలైనంత త్వరలో జగన్ దీక్షను భగ్నం చేయకపోతే పరిణామాలు పూర్తిగా జగన్‌కు అనుకూలంగా మారే ప్రమాదముందని బాబు పసిగట్టి అధికారులను త్వరలో చర్యకు ఆదేశించాడని వార్తలు. పైగా జగన్‌కు ప్రత్యేక హోదా హీరోగా అనూహ్యంగా జనంలో గుర్తింపు వచ్చిందని నిఘావర్గాలు కూడా నివేదించడంతో చంద్రబాబు అధికారులపై ఫైర్ అయ్యారని, జగన్‌ అలా ఎంటర్‌టెయిన్ చేస్తుంటే చూస్తూ నిలబడ్డారా అని అధికారులపై మండిపడ్డాడని నెట్‌లో వార్తలు వచ్చేశాయి. 


దీంతో జగన్‌ని దీక్షాశిబిరంలో అడ్డంగా ఇరికించేశాననుకున్న ప్రభుత్వం డిఫెన్సులో పడిపోయినట్లయింది. వీలైనంత త్వరలో జగన్‌ శిబిరాన్ని ఎత్తివేయించడం ద్వారా ఈ ఎపిసోడ్‌కు మంగళం పలకాలని ప్రభుత్వం భావిస్తోందని తాజా సమాచారం. ఎటూ దీక్ష ఇప్పటికే నాలుగో రోజుకు చేరుకుంది. మరో రెండురోజుల్లో షుగర్ లెవల్స్ పడిపోయాయి.. బీపీ పడిపోయింది... అనే నివేదికలు చూపించి.. జగన్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించి. అక్కడితో దీక్షకు మంగళం పాడేయవచ్చునని పోలీసులు వ్యూహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: