టెక్నాలజీని వాడుకోవడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా.. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిందే నేను.. సెల్ ఫోన్ వచ్చింది నావల్లే అంటూ కాస్త ఎక్స్ ట్రాగా మాట్లాడినా... పరిపాలనలో టెక్నాలజీ వాడటంలో ఆయన దేశంలోనే పేరు గాంచారు. ఇటీవల పట్టిసీమతో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు టెక్నాలజీ అనుసంధానం దిశగా అడుగులు వేశారు..

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రభుత్వశాఖలను అనుసంధానిస్తూ ఈ -ప్రగతి అనే కార్యక్రమం రూపొందించింది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 2400 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. రెండేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో ఏపీ దేశంలోనే  హైటెక్ రాష్ట్రంగా రూపుదిద్దుకోబోతోంది.

విశాఖ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ-ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. నాస్కామ్ తో పాటు , హెపీ,  ఒరాకిల్ , సిస్కో వంటి ఐటీ సంస్థల దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఈ - ప్రగతి ప్రాజెక్టు ద్వారా 315 ప్రభుత్వ సంస్ధలు , 33 శాఖలను అనుసంధానిస్తారు.  745 రకాల ప్రభుత్వ సేవలు అందిస్తారు.

ఇలా ప్రభుత్వ సర్వీసులన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించే కార్యక్రమాన్ని ఇంత వరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంగానీ చేపట్టలేదట. ఈ ప్రాజెక్టు సక్సస్ అయితే... దీన్ని కమర్షియల్ గా ఇతర రాష్ట్రాలకు అమ్మే ఆలోచన కూడా ఉందట.  ఈ ప్రాజెక్టు కోసం ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు అమరావతిలో ఈ-ప్రగతి అకాడమీ కూడా ఏర్పాటు చేస్తారట.


మరింత సమాచారం తెలుసుకోండి: