అసలే ఆ ఇద్దరు నాయకుల వ్యవహార సరళి మీద పార్టీలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఒక నాయకుడి వ్యవహారం అయితే, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. సదరు ఆరోపణలు హైకమాండ్‌ వరకు కూడా వెళ్లాయి. అయినా సరే... ఆయన తీరు మాత్రం ఇప్పటికీ ఏమాత్రం మారుతున్నట్లు లేదు. ఆయన మరెవ్వరో కాదు. కాంగ్రెస్‌ పార్టీకి శాసనసభలో ఫ్లోర్‌లీడర్‌ జానారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిగిలిన అన్ని పార్టీలతో కలిసి బంద్‌ నిర్వహిస్తోంటే.. అందులో పాల్గొనడానికి కూడా ఆయనకు పాపం.. ఆరోగ్యం సహకరించడం లేదుట. అందుకని.. ఆయన ఇంటిలోంచి బయటకు రాకుండా బంద్‌ ఊసెత్తకుండా పరిమితం అయిపోయారు. 


ప్రతిపక్షాల్లో అనైక్యత సంగతి సరే.. సింగిల్‌ పార్టీల్లో కూడ ప్రభుత్వ వ్యతిరేకత విషయంలో ఇన్ని అరాకచకపోకడలు ఉండడమే తెరాస ప్రభుత్వానికి వరంలాగా మారుతున్నట్లున్నది. ఇవాళ తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు అందరూ కలిసి తెలంగాణలో రాష్ట్రవ్యాప్త బంద్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బంద్‌కు కాంగ్రెస్‌ లోనే కొందరు నాయకులు దూరంగా ఉంటున్నారు. పీసీసీ చీఫ్‌ పదవి మీద కన్నేసి.. తనకే ఆ పదవి కావాలని చాలాకాలంగా హైకమాండ్‌ ఒత్తిడి తెస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఇద్దరూ పోరాటానికి దూరంగానే ఉన్నారు. అలాగే తెరాస సర్కారు పట్ల పలు వ్యవహారాల్లో మెతగ్గా వ్యవహరిస్తున్నారని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న జానారెడ్డి, అదే తరహా నాయకుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి అందరూ కూడా.. బంద్‌లో పాల్గొనడం లేదు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ చేసే ఉద్యమం సక్సెస్‌ కాకూడదన్నది తన ఉద్దేశమేమో గానీ.. కోమటిరెడ్డి దూరం ఉండడంలో మర్మం ఇదే అనుకుంటున్నారు. 


జానారెడ్డి ఆరోగ్యం సరిగా లేదనే కారణం చూపి.. బంద్‌లో పాల్గొనకపోవడం అనేది పార్టీలో బహుధా విమర్శలకు గురవుతోది. అసలే తెరాస సానుభూతి పరుడిగా ఆయనమీద ముద్ర ఉంది. రైతు ఆత్మహత్యల సమయంలో పరామర్శలకు కూడా ఆయన వెళ్లలేదు. ప్రాజెక్టుల డిజైన్‌ మార్పునకు సంబంధించిన పోరాటాన్ని ఆయన ఏకంగా వ్యతిరేకించారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న అన్ని పోరాటాలను కూడా.. జానారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం బంద్‌ లో కూడా పాల్గొనకపోవడాన్ని బట్టి.. ఆయన తనమీద పార్టీలో సందేహాలు పెరిగేలా చేసుకుంటున్నారని అర్థమవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: