అసలు మెనూలో వుండే సాంబారన్నం వడ్డించమని కూర్చుంటే.... లేదు లేదు మీ కోసం బిరియానీ తయారవుతోంది... వచ్చేస్తోంది అన్నట్టుంది కేంద్రం వైఖరి. ఇదేదో పార్లమెంటు క్యాంటీన్ లో జరిగిన సన్నివేశం అనుకోకండి. అక్కడి నాయకులకెవ్వరికీ ఏ లోటూ జరిగిపోలేదు.  జరిగేదంతా మనకే, విషయం వివరాల్లోకి వెళితే,  ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోరుతూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన విమర్శలు చూస్తూంటే ఇది ఖచ్చితంగా అర్ధమయ్యే వుంటుంది.


రాష్ట్ర విభజనలో దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో ఒక హక్కుగా రావలసిన ప్రత్యేక హోదా కోసమే వామపక్షాలు, ప్రజలు ఇన్ని ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూంటే స్పందించని కేంద్రం, ఇప్పుడు కొత్తగా ప్రత్యేక హోదా కోరే వాళ్ళను దుయ్యబట్టడం చాలా విడ్డూరంగా వుంది.  రాష్ట్రానికి హోదా కాదు ’అంతకు మించిన’ లాభాలను చేకూర్చుతామని వెంకయ్య నాయుడు చెప్పడం వింటే చాలా హాస్యాస్పదంగా వుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండగానే రాష్ట్ర విభజన చేసినప్పుడు ఆ విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా గురించి కూడా చెప్పివుండాల్సింది అని ధ్వజమెత్తిన వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ పొరపాటు వల్లే ఆ పార్టీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనీస ప్రతిపక్ష హోదా కోల్పోయి తమకు అధికారం చేజిక్కిందనే విషయాన్ని మరిచినట్లున్నారు. మరి ఇలానే ప్రత్యేక హోదా గురించి మాటలు చెపుతూ వాయిదాలు వేస్తూ పోతే తమ పార్టీ భవిష్యత్తు ఏమౌంతుందనే దానికి ఉదాహరణగా కాంగ్రెస్  పార్టీని చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందనే విమర్శలు బాహాటంగా వినబడుతున్నాయి.


అసలు మాకు వడ్డించాల్సిన ప్రత్యేక హోదా ఏ ఒత్తిడులకు లోనై అడ్డుపడకుండా వడ్డిస్తే చాలు అది సాంబారన్నమైనా సరే మాకు ’అంతకు మించిన’ వేరే ఏ సౌకర్యాలు కల్పించినా తరువాత చూసుకోవచ్చు ముందు వెంటిలేటర్లపైనున్న మాకు ఇవ్వాల్సింది ఇచ్చి బ్రతికిస్తే చాలు దేవుడా అని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. 


అటు వెంకయ్యనాయుడే ఆ మాట అంటూ ఉన్న తరువాత.. భాజపాలోని చిన్నా సన్నా నాయకులంతా అదే పాట పాడుతున్నారు. పురందేశ్వరి, సోము వీర్రాజు ఇతర భాజపా నాయకులు కొందరు హోదా కంటె ఎక్కవే ఇస్తారు కదా అంటూ గోల చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: