న్నమొన్నటి దాకా అమరావతి శంకుస్థాపనకు ముగ్గురు దేశాధినేతలు రాబోతున్నారంటూ ఏపీ సర్కారు ఊదరగొట్టింది. మన దేశ ప్రధాని నరేంద్రమోడీతో పాటు, సింగపూర్‌, జపాన్‌ దేశాధినేతలు కూడా.. మన శంకుస్థాపన కార్యక్రమానికి రాబోతున్నారంటూ.. చంద్రబాబునాయుడు చాలాకాలం ముందునుంచి టముకు వేశారు. దానికి వారిని స్వయంగా ఆహ్వానించడానికే అన్నట్లుగా ఆయన బృందాన్నంతా వెంటబెట్టుకుని సింగపూర్‌ వెళ్లి వచ్చారు కూడా! అయితే తాజాగా శంకుస్థాపన ఏర్పాట్లకు మరియు రాజధానిక ప్రాంతానికి కూడా అంతా తానే అయి వ్యవహరిస్తున్న మంత్రి నారాయణ మాటలను గమనిస్తే.. సింగపూర్‌, జపాన్‌ ప్రధానులు రావడం డౌటే అని అనిపిస్తోంది. తాజాగా ఆయన శంకుస్థాపన ఏర్పాట్ల గురించి వివరిస్తూ.. వారిద్దరూ కూడా వచ్చే అవకాశం ఉన్నదని వెల్లడించారు. 'అవకాశం ఉన్నది' అంటున్నారంటేనే.. రాకపోవచ్చుననే సంకేతాలు ఇస్తున్నట్లే అని పలువురు అంచనా వేస్తున్నారు. 


సాధారణగా ఒక దేశాధినేత విదేశీ టూర్‌కు వెళ్లడం అంటే అంత చిన్న విషయం కాదు. మన ప్రధాని నరేంద్రమోడీ విదేశాలకు వెళుతున్నా సరే.. కనీసం రెండు నెలల ముందుగానే టూరు సంగతి షెడ్యూలు ఖరారు అవుతుంది. దానికి సంబంధించి ముందే ప్రకటన కూడా చేసేస్తారు. అంతే తప్ప ఏదో పెళ్లికి వెళ్లినట్లుగా.. తలచుకోగానే.. రెడీ అయిపోయి, వెళ్లిపోవడం సాధ్యం కాదు. మన దేశపు సొంత ప్రధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారంటేనే.. సుమారు 15రోజుల ముందుగానే.. ఆయన టూర్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసి, ప్రకటించేశారు. 


అదే తరహాలో విదేశీ దేశాధినేతలు వస్తూ ఉండేట్లయితే.. దానికి సంబంధించి కూడా.. వారు కనీసం ఆ దేశాల్లో అయినా తమ భారత టూర్‌ గురించి అధికారిక ప్రకటనలు ఈ సరికే చేసి ఉండాల్సింది. అయితే ఆ రెండు దేశాల్లోనూ అలాంటి అధికారిక ప్రకటనలు వచ్చినట్లుగా ఇప్పటిదాకా ఎక్కడా వార్తలు రాలేదు. పైగా ఈ అమరావతి నిర్మాణం అనేది ఆ దేశ ప్రభుత్వాలు ఒక వ్యాపారం డీల్‌ లాగా చేస్తున్న కార్యక్రమాలు మాత్రమే. ఇది మనకు ప్రతిష్ఠాత్మకమే గానీ, వారికి కేవలం ఒక వ్యాపారం లాగా మాత్రమే అనిపిస్తుంది. ఇలా ప్రపంచదేశాల్లో తాము చేసే ప్రతి వ్యాపారం ఓపెనింగ్‌కు దేశాధినేతలు వెళ్లాలంటే వారికి కుదరకపోవచ్చు. అందుకే ఆ రెండు దేశాల అధ్యక్షులు రాకపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: