ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) పిడుగుపాటు లాంటి షాక్ ఇచ్చింది. తుళ్లూరు సమీపంలోని అమరావతి రాజధాని నగరంకోసం చేస్తున్న భూమి చదును పనులను ఉన్నఫళాన నిలిపివేయవలసిందిగా శనివారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  అక్టోబర్ 22న నిర్వహించనున్న నవ్యాంద్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కోసం కొనసాగుతున్న భూమి చదును కార్యక్రమాలపై శనివారం కేబినెట్ సమావేశంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం నిజంగానే షాక్ కలిగించింది. 


భూమి చదను పనులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నేడే ఏపీ ప్రభుత్వానికి అనుమతి నివ్వవలసి ఉంది.  పి శ్రీమన్నారాయణ అనే వ్యక్తి ఇచ్చిన పిటిషన్ ఆధారంగా రాజధాని ప్రాతంలో ఏ నిర్మాణాన్నీ చేపట్టరాదని గ్రీన్ ట్రిబ్యునల్ ఇదివరకే తాత్కాలిక స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ శ్రీమన్నారాయణ చాలా కాలం క్రితమే సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. తర్వాత సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కి బదలాయించింది. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించిన అంశాలపై అంతిమాధికారం ఈ ట్రిబ్యునల్‌కే ఉంది.


శ్రీమన్నారాయణ వేసిన పిల్ (171/2015)పై వాదనలు విన్న ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి దిగ్బ్రాంతి కలిగిస్తూ ఇవ్వాళే తీర్పును ప్రకటించింది. పంటలు పండించే ప్రాంతంలో, వరదలు ముంచెత్తే ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి పూనుకోరాదంటూ పిటిషన్‌దారు వాదించారు. 


మాగాణి భూములుపై, వరదల్లో మునుగగలవని భావిస్తున్న ప్రాంతంపై ఒక నివేదికను తనకు సమర్పించవలసిందిగా ట్రిబ్యునల్ ఆంధ్రప్రభుత్వ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది. ట్రిబ్యునల్ ఆదేశంతో షాక్ తిన్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే భూమి చదును కార్యక్రమాలకు అనుమతి కోరుతూ ట్రిబ్యునల్‌కి దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. పైగా ట్రిబ్యునల్ నోటీసుకు కౌంటర్ దాఖలు చేయడానికి కూడా ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.


చంద్రబాబుకు, ఆయన నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రతిపక్షం అన్నా, ప్రజాభిప్రాయం అన్నా ఏమాత్రం గౌరవం, విలువ లేవని అందరికీ తెలిసిన విషయమే. జాతీయ సాధికార సంస్థలను కూడా తోసిరాజని, రాజధాని శంకుస్థాపనకు సాక్షాత్తూ ప్రధానినే రప్పిస్తున్నాంగా అనే ఔద్ధత్యం, తన మాటకెదురులేదనే అహంకారం, ఎవరినైనా తాను మానిప్యులేట్ చేయగలననే గర్వాతిశయం నరనరాన వ్యాపించి పోయిన ప్రభుత్వానికి, ట్రిబ్యునల్ సరైన షాక్ ఇచ్చింది. తనకెదురు లేదని, తన మాటకు తిరుగులేదని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే జాతీయ సంస్థలు చూస్తూ ఊరకుండవని ఈ ఉదంతం చెబుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: