ఇల్లు కాలి ఒకడేడుస్తూంటే మరొకడొచ్చి ఇంకేదో చేసాడన్నట్టుంది తెలుగు రాష్ట్రాల మేధావి నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ వ్యవహరిస్తున్న తీరు.  ప్రజల కష్టాల కన్నా రాజకీయ ప్రక్షాళనపైనే ఎక్కువగా స్పందించే మన జేపీ గారు చాన్నాళ్ళ తరువాత ఇటీవల మళ్ళీ జనంలో పడ్డట్టున్నారు. వివిధ అంశాలపై స్పందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన స్థాపించిన లోక్ సత్తా పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవచ్చు గానీ.. అందుచేత, ప్రజల కష్టాలు, ప్రజా ఉద్యమాలతో కూడా తమకు సంబంధం లేదన్నట్లుగా వారు చూసీ చూడనట్టు పోతుంటారు. మరి జేపీ మాత్రం.. జాతీయ అంశాల మీద గళం విప్పుతున్నారు. 


ఇంతకీ విషయమేమిటంటే, చాలాకాలం తర్వాత మేధావి నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ మౌనం వీడి తన అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారు. కాకపోతే అవి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొడవలో, ఆంధ్రప్రదేశ్ ప్రతేకహోదా గురించో కాదు. దాద్రీ దురాగతం, రాష్ట్రపతి అభిప్రాయం పార్టీలు.. ప్రజలు ఇలాంటి పెద్దపెద్ద విషయాల మీద ఆయన స్పందిస్తూ రాజకీయాలున్నవి ప్రజల కోసమేనని గుర్తు చేస్తూ, ఆయన కూడా గుర్తు చేసుకున్నారు. కాకపోతే అదేదో మన తెలుగురాష్ట్రాల సమస్యలపై స్పందిస్తూ జాతీయ స్థాయిలోకి వెళ్ళే ముందు ఇక్కడి మన పరిస్థితులపై ఎందుకు స్పందించలేకపోతున్నారో ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందనేది. దీన్నే “ఇంట గెలిచి రచ్చ గెలవడమంటారు”.  ఇప్పటికిప్పుడు జేపీగారు రాష్ట్రాలను దాటి జాతీయస్థాయికి వెళ్ళాలనే ఆలోచన ఆచరణ సాధ్యమా కాదా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నట్టే కనపడుతోంది.


జయప్రకాశ్ నారాయణ్ నిజాయితీ పరుడు, మేధావి అనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. కాకపోతే.. ఆయన లోక్ సత్తా అనే పార్టీకి తాను జాతీయ అధ్యక్షుడు అనే హోదా తగిలించుకున్నందుకు రెండు తెలుగు రాష్ట్రాల అంశాలే మాట్లాడడం ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించడమే జనానికి నచ్చడం లేదు. ఎన్నికల పర్వం  వచ్చినప్పుడు ఈ ప్రాంతం నుంచే బరిలోకి దిగాలని కలలు కనే.. జేపీ.. ఇక్కడి ప్రజలే తనను ఎంపీగా దేశంలో అత్యున్నత చట్టసభకు పంపాలని కోరకునే జేపీ.. ఇక్కడి ప్రజల కడగండ్ల గురించి ఒక మేధావిగా.. సదాలోచనను ప్రజలకు అందించగలిగిన వ్యక్తిగా స్పందించకపోతే ఎలాగ అనే మాటలు పలువురిలో వినిపిస్తున్నాయి.


అందుకే దాద్రీ దుర్ఘటన, దానిపై రాష్ట్రపతి స్పందనను కీర్తించడం అంతా ఓకే గానీ... మన తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల మీద తమలాంటి మేధావులు స్పందిస్తే మంచిది కదా సారూ.. అంటూ పలువురు కోరుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: