ఓం
భూర్భువస్సువః |
తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ || ఓం ||


అన్ని పరిస్థితులలోను జీవిత పురోగతిని కలిగించే శక్తిని సంతరించు కొన్నది గాయత్రీ మంత్రము. కోట్లాది మందిచే కాలాల పర్యంతం జపింపబడి వస్తూన్నది ఈ మంత్రము. స్త్రీ పురుషులు, చిన్నలు పెద్దలు, ఫలానా దేశస్థులు, ఫలానా మతస్థులు అనే విచక్షత లేకుండా సర్వులూ దీనిని జపించి ఉన్నతి పొందవచ్చు. ఒక ఫలానా దైవం అంటూ కాక జ్యోతిర్మయ దైవాన్ని ధ్యానించేటట్లుగా రూపొందడం చేత యావత్ప్రపంచానికీ ఈ మంత్రం వర్తించే రీతిలో ఒప్పారుతున్నది.


గాయత్రీ మాత


అలా ఈ మంత్ర విశిష్టత ఏమిటి?

ఈ మంత్రం బుద్ధి స్పష్టటకై ప్రార్థిస్తుంది. ‘అష్టకష్టాలకు హేతువు అజ్ఞానమే అని మన ఉపనిషత్తులు వక్కాణిస్తున్నాయి. సమాజంలోనైనా ఆధ్యాత్మికంగానైనా, లేక మరే రంగంలోనైనా ఇది నగ్నసత్యం’ అని చెబుతారు స్వామి వివేకానంద. ఈ అజ్ఞానం సశించి బుద్ధి స్పష్టత పొంద ఈ మంత్రం ప్రార్థిస్తుంది.


ఈ బుద్ధి స్పష్టత ఎలాటి బాహ్యవస్తువుల ప్రేరణచేత కాకుండా చేతనా అంతరాళం నుండి ఉద్భవిస్తుంది. దీనిని అంతర్భుద్ధి  అని పేర్కొంటారు. ఇది ఎప్పటికీ అసత్యంకాబోదు. ఏ రంగాన్ని తీసుకొన్నా, మానవుడి ఆవిష్కృతులన్నీ ఈ అంతర్భుద్ధి నుండి ఆవిర్భవించినవే. ఇది ప్రతి ఒక్కరిలోను పనిచేయ నారంభించలేదు. విజ్ఞానం, కళలు, ఆధ్యాత్మికత అంటూ ఏ రంగాన్ని తీసుకొన్నా వాటి ఉన్నత శిఖరాలకు వాకిలిగా భాసిల్లూతూవుండేది అంతర్భుద్ధి.


ఈ అంతర్భుద్ధినే శాస్త్రాలు బుద్ధి, ధీః ఇత్యాదులుగా పేర్కొంటాయి. ఈ బుద్ధిని జాగృతం గావించమని అరుణకిరణమూర్తియైన సూర్యభగవానుని ఈ మంత్రం ప్రార్థిస్తుంది. ఏ రకమైన జీవితమైనా, దాని ఉన్నతికి కీలకంగా, ఉన్నత స్థితులకు ఆలవాలంగా ఉండడంచేత ఈ మంత్రం వరాలను అనుగ్రహించే దివ్యమంత్రం (వరదాదేవి) గాను, మంత్రాల తల్లి (ఛాందసాం మాత) గాను ఆరాధింపబడుతున్నది.



మరింత సమాచారం తెలుసుకోండి: