మనం ఏ పని చేసినా అందుకు ఒకటే కారణం.. ఆనందం.. ఎక్కువ సంపాదించాలని ఆరాట పడతాం.. ఎందుకు.. ఆనందం కోసం.. ఖర్చు పెట్టడం ద్వారా ఆనందం పొందాలని ప్రయత్నిస్తాం. మనవాళ్ల కోసం ఏదైనా కొని పెట్టడం ద్వారా ఆనందం పొందుతాం.. కానీ..అసలైన ఆనందం బయటి వస్తువుల ద్వారా కాదని.. అది మనలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నాం. 

మనసు ప్రశాంతంగా లేకపోతే.. ఏమైనా సమస్యలు చుట్టుముడితే దైవప్రార్థన చేస్తాం.. దేవాలయానికో, మసీదుకో, చర్చికో వెళ్తాం.. అక్కడ మనం ఏమీ కొనకపోయినా.. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోయినా మనం ఆ కాసేపు అలౌకిక ఆనందం పొందుతాం. అయితే అది కొద్ది సేపే. కానీ దైవ ధ్యానాన్ని మనం జీవితంలో ఓ అలవాటుగా మార్చుకోవడం ద్వారా అలౌకిక ఆనందం పొందడం సులభమే. 

మనం అలౌకిక ఆనందం పొందాలని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే.. దైవం వైపు ఒక అడుగు వేస్తే.. ఆ దైవమే మనవైపు పది అడుగులు వేస్తుంది. కాకపోతే ఈ ప్రయత్నం చిత్తశుద్ధితో ఆత్మపూర్వకంగా జరగాలి. అది జరిగిన రోజు మనం ఆ ఆనందాన్ని స్వయంగా అనుభవిస్తాం. అయితే సాధన అంత సులభమైందేమీ కాదు. కానీ అసాధ్యమూ కాదని మనం గుర్తించాలి. 

దైవ ధ్యానం మనస్ఫూర్తిగా చేయడం ద్వారా మనం మనలోని నేను అనే భావన క్రమంగా మాయమవడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సాధన ఓ స్థాయికి రావాలంటే మాత్రం కొద్దిగా శ్రమించక తప్పదు. కానీ కొన్నిరోజులు సాధన చేస్తే ఇది సాధ్యమవుతుంది. జీవితంలో కొత్త కాంతులు ప్రసరిస్తాయి. జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. 

మనం వస్తు సమూహం వైపు పరుగులు తీయడం మానివేసి.. ఆధ్యాత్మికత వైపు, ఆత్మను కనుగోనే మార్గం వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చేసింది. మీలోని నిజమైన ఆనందాన్ని బయటకు తీయాల్సిన సుదినం వచ్చేసింది. పవిత్రమైన మనస్సుతో మనం సాధన చేస్తే.. మనకు అన్నివైపులా ప్రేమే కనిపిస్తుంది. జీవితం ఆనందమయం అవుతుంది. ప్రయత్నించి చూడండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: