మనిషి జీవితమే నిరంతరం పోరాటాల మయం.. ఈ భూమిపై జన్మించీ జన్మించగానే కష్టాలు ప్రారంభమవుతాయి. అనేక రోగాలు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తాయి. కాస్త ఎదిగీ ఎదగగానే మనుగడ కోసం పోరాటం ప్రారంభమవుతుంది.. ముందు చదువు.. ఆ తర్వాత ఉద్యోగం.. ఆ పై వివాహం.. మళ్లీ గృహస్తు బాధ్యతలు.. వెనక్కి తిరిగి చూసుకునేలోగానే జీవితం వృద్ధాప్యంలో పడుతుంది. 

మరి ఈ నిరంతర ప్రస్తానంలో మనిషికి ఆనందమెక్కడ.. మనిషి జీవితమంతా కష్టాలమయమేనా.. ఇలాంటి వైరాగ్యపు ఆలోచనలు అప్పుడప్పుడు అందరికీ వస్తుంటాయి. అందుకే  ఈ పోరాటం నుంచి ఉపశమనం కోసం.. కష్టాల నుంచి విముక్తి కోసం ఆధ్యాత్మికత మనిషికి ఊరటనిస్తుంది. అందులోనూ స్నానం, ధ్యానం, గానం, పానం అనే నాలుగు సూత్రాలు పాటిస్తే ఆనందం మన సొంతమవుతుంది. 

స్నానం అంటే మామూలు స్నానం కాదు. పవిత్ర నదీ జలాల్లో స్నానం చేయడం.. పవిత్ర నదుల చెంత ఆధ్యాత్మిక కేంద్రాలుంటాయి. ఆయా క్షేత్రాల్లో పవిత్న స్నానం ఆచరించడం మనసుకు ప్రశాంతతనిస్తుంది. సంసారిక కష్టాల నుంచి విముక్తి ప్రసాదించి మనసును ఆనందతీరాలవైపు తీసుకెళ్తుంది. అందుకే వీలైనప్పుడల్లా పవిత్ర నదీజలాల్లో స్నానం చేస్తుండాలి.

రెండోది ధ్యానం. ఇష్టదైవాన్ని ధ్యానించండం మనసుకు అలౌకిక ఆనందాన్నిస్తుంది. ఈ ధ్యానం వల్ల మనిషికి ఏకాగ్రత లభిస్తుంది. పరిపరివిధాల పరుగులెత్తే మనసు గుర్రానికి కళ్లెం వేసి మనలోని అసలైన మనల్ని కనుగొనే అవకాశాన్ని కల్గిస్తుంది  ఈ ధ్యానం.  ధ్యానంలో ఒక స్థాయి వచ్చే వరకూ కాస్త కష్టం అనిపించినా.. ఆ తర్వాత ఆ ధ్యానం మనసుకు కలిగించే ఆనందం వర్ణనాతీతం. 

ఇక మరో ఆనంద సూత్రం గానం. ఈ గానం మనిషికి మాత్రమే దేవుడు ప్రసాదించిన అద్భుతమైన వరం. మన నిత్య జీవనపోరాటంలో పడి మనం ఈ విషయాన్ని గుర్తించనే గుర్తించం. ఇష్టదైవాన్ని స్తుతిస్తూ చేసే గానం మనసుకు అంతులేని ప్రశాంతతను చేకూరుస్తుంది. గానం వల్ల గాత్ర శుద్ధి ఏర్పడుతుంది. మనస్సూ ప్రశంతమవుతుంది. 

ఇక చివరి సూత్రం పానం. అంటే భగవంతునికి అభిషేకం చేసిన జలాలను తీర్థంగా స్వీకరించడం.. ఇలా ఈ నాలుగు సూత్రాలను జీవితంలో పాటించడం అలవాటుగా మార్చుకుంటే ఆనందం మీ సొంతం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: