నేడు సూర్య జయంతి. ప్రత్యక్షదైవంగా పిలుచుకునే ఆ శ్రీ సూర్యనారాయణుని జయంతి. దీన్నే రథ సప్తమిగా పిలుచుకుంటాం. మహాభాస్కర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం జిల్లా  అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవాలు ఏటా కన్నులపండవగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా శనివారం అర్థరాత్రి నుంచే భక్తులు అరసవల్లికి పోటెత్తారు. 

ఈసారి అరసవల్లి దేవాలయంలోని  మూలవిరాట్టుకు విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మహాక్షీరాభిషేకం చేశారు. సూర్యుని జన్మదినమైన రథసప్తమి రోజున స్వామి వారిని భక్తజనం విశేషంగా దర్శించుకుంటున్నారు. నిత్య పూజలు అందుకుంటున్న సూర్యభగవానునిని వీక్షించేందుకు ఆనందోత్సవాలతో తరలివస్తున్నారు. 

శనివారం అర్థరాత్రి 12 గంటల 20 నిమిషాలు దాటాకా సూర్య జయంతి ఉత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేశారు. సుప్రభాతం, నిత్యార్చన, ద్వాదశ హారతి ఇచ్చారు. వేద పారాయణంతో పాటు ఆదిత్యుని మూలవిరాట్టుకు మహాక్షీరాభిషేక సేవలు  ప్రారంభించారు. 216 రూపాయల టిక్కెట్లు తీసుకున్న భక్తులు క్షీరాభిషేకం దర్శనాన్ని ఆరు గంటల వరకూ చేసుకున్నారు. 

తొలిపూజల్లో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ కూన రవికూమార్ , ఎంపీ రామ్మెహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గుండా లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్  లక్ష్మీనృసింహ పాల్గొన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు నిజరూప దర్శనంతో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం నాలుగు గంటల తరువాత నుంచి పుష్పాలంకరణ సేవ, ఏకాంతసేవ  చేస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: