ఎంతటి వ్యక్తికైనా మార్గదర్శి కావాలి. ఇదిగో ఈ మార్గంలో పయనించు.. నీకు శుభం కలుగుతుంది అని చెప్పేవాడు ఒకడు ఉండాలి. ఏ పని చేయాలన్నా అందుకు ఎన్నో మార్గాలు ఉంటాయి. మరి వాటిలో ఏది మంచి మార్గం.. ఏది  చెడు మార్గం. ఏ దారి అనుసరించాలి.. ఏ దారిలో వెళ్తే ఎలాంటి ఇబ్బందులుంటాయి.. అనే అంశాలను విడమరచి చెప్పే వ్యక్తి కావాలి. 

అతడినే గురువు అంటున్నాం. మరి మనకు మంచి గురువు ఎక్కడ దొరుకుతారు. ఈ స్పీడ్ యుగంలో అసలు అలాంటి గురువులు ఉన్నారు.. ఉంటే వారిని ఎలా పట్టుకోవాలి. ప్రతి రోజూ వారు అందుబాటులో ఉంటారా.. ఉన్నా వారు చెప్పింది పాటిస్తే జీవితంలో విజయం దక్కుతుందా.. సదరు గురువులు తమ స్వార్థం కోసం మనల్ని పావులుగా వాడుకుంటారా..ఇలాంటి సందేహాలెన్నో కలుగుతాయి. 

కానీ మనందరికీ అందుబాటులో ఓ గురువు ఉన్నాడు. ఆయన మనకు ఎప్పుడూ సత్యమార్గమే సూచిస్తాడు. ఎన్నడూ మనల్ని తప్పుదోవ పట్టించడు. ఏనాడూ ఆయన చెప్పిన మార్గం తప్పుకాదు.. ఎవరికైనా ఎలాంటి సమయంలోనైనా ఆయన సలహా దొరుకుతుంది. మంచి సలహా ఇచ్చినందుకు ఆయన మన నుంచి ఎలాంటి ప్రతిఫలమూ ఆశించడు.

మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఆయన ఎవరో చెప్పండి.. అంటారా.. ఆయన మరెవ్వరో కాదు.. మన అంతరాత్మ. మన ప్రతి ఒక్కరిలోనూ అంతరాత్మ రూపంలో ఒక గురువు ఉన్నాడు. మనం చేసే ప్రతి పని విషయంలోనూ ఆ అంతరాత్మ మనకు మార్గం చూపుతూనే ఉంటుంది. కానీ మనం చాలాసార్లు ఆ అంతరాత్మ మాట వినం. పెడచెవిన పెడతాం. ఎందుకంటే ఎలాంటి ఖర్చు లేకుండా వస్తున్న సలహా కదా. 

అందుకే యోగి వేమన ఓ మాట చెబుతాడు.. గురువుల కోసం గుహల్లోకి వెళ్లి వెతుకుతున్నారా.. పిచ్చివాళ్లారా.. అక్కడ గురువుల కంటే క్రూర మృగాలు ఉంటాయి. మిమ్మల్ని తినేస్తాయి.. అదే మీకు ముక్తి మార్గం చూపిస్తుంది.. వెటకారం చేస్తాడు. కాస్త మొరటుగా చెప్పినా నిత్య సత్యం అదే. నీలోనే ఉన్నగురుడును ముందు కనిపెట్టు.. అది చెప్పే మాట వినిపెట్టు.. మీకు నిత్యం జయమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: