ఏడు కొండలపై కొలువుదీరిన ఆ ఏడుకొండలవాడు వార్షిక వసంతోత్సవాల కోసం ముస్తాబయ్యాడు. తిరుమలగిరులకు వసంతోత్సవ శోభ వచ్చేసింది. ఏటా తిరుమలలో జరిగే శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టిటిడీ  అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.

వేసవిలో స్వామివారికి వేడిమి తాపం నుంచి చల్లని ఉపశమనాన్ని కల్పించడం కోసమే ఈ వసంతోత్సవం నిర్వహిస్తారు. వసంతరుతువును ఆహ్వానిస్తూ చైత్ర పౌర్ణిమకు ముగిసేటట్లుగా మూడురోజుల పాటు తిరుమలలో వసంతోత్సవాలను నిర్వహిండం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాలకు వేదిక.. శ్రీవారి ఆలయం వెనుకవైపు ఉన్న వంసంతోత్సవ మండపం.

వసంతోత్సవ వేళ మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా ముస్తాబు చేశారు. ప్రకృతి సోయగాలు ఉట్టిపడే విధంగా టీటీడీ ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. వసంతోత్సవాన్ని  వన్యమృగాలు, పశుపక్షాదులు తిలకించడానికి వచ్చాయా అన్నట్లుగా సహజత్వం ఉట్టిపడే విధంగా భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు.

స్వామి అమ్మవార్లును అధిష్టించే మండపాన్ని సుగంధ పరిమళాలు వెదజళ్లే వట్టివేరుతో అలంకరించారు. ఈ వసంతోత్సవాల్లో మొదటిరోజు ఉభయనాంచారులతో కలసి శ్రీవారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వస్తారు. స్నపన తిరుమంజనం, అభిషేకాలు, నివేదనలు, ఆస్థానాలు పూర్తయిన తరువాత రాత్రి 7 గంటలకు తిరిగి ఆలయంకు చేరుకుంటారు.

రెండో రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామివారు స్వర్ణరథంపై  తిరువీధులో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం వసంత మండపంకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం వరకు అర్చకులు స్వామివారికి  ఆస్థానాలను నిర్వహిస్థారు. చివరి రోజున మలయప్పస్వామివారితో పాటు శ్రీసీతారామలక్ష్మణ, ఆంజనేయస్వామి, శ్రీ రుక్ష్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవర్లకు వసంతోత్సవం వేడుకల్లో పాల్గొంటారు. ఉత్సవమూర్తులను ఉరేగింపుగా ఆలయంకు తీసుకురావడంతో వసంతోత్సవాలు వైభవంగా పూర్తవుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: