భూలోకంలో మానవులు చేసిన పాపాలను పటాపంచలు చేయడానికి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు రూపుడైన శ్రీరామచంద్రుడు భూలోకంలో స్థాపించిన లింగమే రామేశ్వరంలోని రామలింగేశ్వరుని లింగం. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ శివలింగం భక్తుల పాపాలను పోగొడుతూ సకల జనుల పూజలను అందుకుంటుంది. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదల్లేదు అనేది ఒక నానుడి. అంటే సకల పాపాలు తొలగిపోవాలంటే చివరి మజలీ రామేశ్వర దర్శనం అనేది వారి భావన. ఏ విధంగానైనా సరే రామేశ్వర లింగాన్ని స్మరిస్తే చాలు ఇహపరలోకాలలో దుఃఖం దూరం అవుతుంది.


రామనాథుడిని మధ్యాహ్న కాలంలో దర్శించిన వారికి తెలిసీ తెలియక చేసిన తప్పులు నశిస్తాయి. సాయం కాలంవేళ మహాస్త్రోత్రాలతో రామేశ్వరుడిని స్తుతిస్తే బంగారాన్ని దొంగిలించిన పాపాలు నశిస్తాయి.  ప్రాణంపోయే సమయంలో ఆ స్వామి నామాన్ని స్మరిస్తే శంకరత్వం దక్కుతుంది, రామనాథ, మహాదేవ, ఓ కరుణానిధి నన్ను రక్షించు అని నిరంతరం స్మరిస్తూ ఉండేవారికి బాధలు ప్రాప్తించవు. రామనాథ మహాలింగానికి అభిషేకం జరుగుతున్నప్పుడు గేయాలు ఆలపించటం, వాద్యాలను మోగించటంలాంటివి భక్తితో చేసినవారికి రుద్రలోకప్రాప్తి కలుగుతుంది.


అలాగే ఆ స్వామికి అభిషేకం జరిగేవేళ రుద్రాధ్యాయాన్ని నమక చమకాలను, పురుష సూక్తాన్ని, ఆ స్వామికి సంబంధించిన సూక్తులను పఠించటం వల్ల నరకం దూరం అవుతుంది.  ఆవుపాలు, పెరుగుతో, నెయ్యితో రామనాథ మహాలింగానికి అభిషేకం చేయిస్తే నరకాన్ని తెచ్చిపెట్టే పాపఫలం దూరం అవుతుంది. ఈ విధంగా అభిషేకం చేయిస్తే పాపవిముక్తి కలిగి శివుడికి ఇష్టం అయిన విష్ణులోకంలో ఆ భక్తుడు సుఖంగా ఉండే అదృష్టం పొందుతాడని విశ్వాసం. 

మరింత సమాచారం తెలుసుకోండి: