ప్రపంచం విజ్ఞానం వైపు ఎంత వెగంగా పరుగులు పెడుతున్నా..అంతరిక్షానికి అడుగులు వేస్తున్నా కృత్రిమ అవయవాలు సృష్టిస్తూ ఎంతో అభివృద్ది చెందుతున్నా..దైవం అంటే భయం భక్తీ రెండూ ఉన్నాయి. ఆపరేషన్ చేసి మనిషిని రక్షించే డాక్టర్లు కూడా మా ప్రయత్నాలు మేం చేశాం..అంతా దేవుడి దయ అంటారు. అలాంటి దేవుడు అంటే మనిషికి ఎంతో భక్తి..ఏ మతం వారు ఆయా దేవుళ్లను ప్రార్ధిస్తుంటారు..పూజిస్తుంటారు. ముఖ్యంగా హిందూ మతంలో దేవుళ్లు వేలల్లోనే ఉన్నారు. ముఖ్యంగా శివుడు, విష్ణువులను బాగా కొలుస్తారు. ఇందులో శివుడికి రూపం లేకుండా ఆయన ఆత్మలింగాకారానికి పూజలు చేస్తుంటారు. కష్టాల్లో ఉన్నవారు శని పూజ చేస్తే తమ కష్టాలు తొలగిపోతాయని మంచి నమ్మకం ఉంది. మహాశివుడిని బిల్వ పత్రాలతో పూజిస్తే మంచిది. శనిదోషం ఉన్నవారు బిల్వపత్రాలతో శివుణ్ని పూజిస్తే ఆ దోషం పరిహారం అవుతుందని అంటారు అది తెలుసా? ఈ విషయాన్ని స్వయంగా శివుడే చెప్పాడట.ఓసారి శివుణ్ని దర్శించుకోవడానికి శనీశ్వరుడు కైలాసం చేరుకుని, పార్వతీ పరమేశ్వరులను భక్తితో ప్రార్థించాడు.
Image result for bilva patra
అయితే పరమేశ్వరుడికి ఎందుకో శనిని పరీక్షించాలనిపించింది. దీంతో నేను ఎక్కడ ఉన్నా, ఏ రూపంలో ఉన్నా నీవు గుర్తించగలవా అని శనిని ప్రశ్నించాడు. మీ అనుగ్రహం ఉన్నంత కాలం మీరు ఏ రూపంలో ఉన్నా గుర్తుపట్టగలనని శని బదులిచ్చాడు.   నేను ఎక్కడ ఉండేది కనిపెట్టి, నన్ను పట్టుకో చూద్దాం అని శివుడు శని దేవుడికి పరీక్ష పెట్టాడట. మరుసటి రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించేలోగా మిమ్మల్ని పట్టుకుంటానని శని శివుడికి చెప్పాడు. దీంతో శనికి దొరక్కుండా ఎక్కడ దాక్కోవాలా, అని తెగ ఆలోచించిన శివుడు చివరకు సూర్యోదయ సమయంలో బిల్వ వృక్ష రూపంలోకి మారాడు. సాయంత్రం తర్వాత శివుడు బిల్వ వృక్షం రూపాన్ని విడిచి తన అసలు రూపాన్ని ధరించాడు.
Image result for bilva patra
వెంటనే శివుడితోపాటే శని కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శనీ నన్ను పట్టుకోలేకపోయావుగా? అని పరమేశ్వరుడు శనితో అన్నాడట. దానికి శనిదేవుడు బదులిస్తూ.. స్వామి నేను మిమ్మల్ని పట్టుకున్నా కాబట్టే కదా.. మీరు బిల్వ వృక్ష రూపంలోకి మారారు. నేను కూడా ఈ బిల్వవృక్షంలో అదృశ్య రూపంలో మీతోపాటే నివసించా. ఇదంతా శివలీల అని వినమ్రంగా పలికాడు. శని దేవుడి విధి నిర్వహణకు, భక్తికి ముగ్ధుడైన పరమేశ్వరుడు ఈశ్వరుడినైన నన్నే పట్టావు కాబట్టి ఇక నుంచి నీవు శనీశ్వరుడిగా ప్రసిద్ధి చెందుతావని వరమిచ్చాడు.

బిల్వ దళాలతో నన్ను పూజించిన వారికి శని దోష నివృత్తి కలుగుతుంది. మారేడు ఆకులతో నాకు పూజ చేసిన వారిని, శివభక్తులను శనీశ్వరుడు బాధించడు అని అభయం ఇచ్చాడు. నాటి నుంచి బిల్వ వృక్షాన్ని శివుడి స్వరూపంగా భావించి బిల్వ పత్రాలతో పరమేశ్వరుణ్ని పూజించడం సంప్రదాయంగా మారింది.  అందుకే శివునికి ఇష్టమైనవి బిల్వ పత్రాలు అని అంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: