ఒక బ్రాహ్మణుని యింటికి ప్రతిదినము వచ్చెడి ఆయవారపు బ్రాహ్మణుడు కోడలు, కూతురు యుపాదానము ఇచ్చినపుడు "గంగాస్నానప్రాప్తి"రస్తనియు, కోడలు యుపాదానము నిచ్చినపుడు "సౌభాగ్యసిద్ధి"రస్తనియు దీవించుచుండెను. ఒకనాడా యింటి యజమాని అది ఆలకించినందున "అయ్యా! వారిరువురనట్లు వేరువేరుగ దీవించుచుంటిరేమి?" యని అడుగగ నా విప్రుడు వారితో నీ కోడలికి నూరు సంవత్సరము యైదవతనమున్నది. కావున అటులంటిని. నీ కుమార్తెకు వైధవ్యము కలుగనున్న కారణమున నటులంటిని. ఆమెకా విపత్తు పోవలయుననిన నేను చెప్పినట్లు చేయింపుడని వారికొక ఉపాయము చెప్పి వెడలిపోయెను.

          కొన్ని దినములకటులనే బ్రాహ్మణుని కుమార్తెకు వివాహము జరిగినది. అటులనే ఆమె భర్త యొకనాటి రాత్రి మరణించెను. విప్రకుమారి ధైర్యము వహించి ఆయవారపు బ్రాహ్మణుడు చెప్పినట్లుగా యింటికి తాళమువైచి, గంగానదికి పోవుచుండ దారిలో నామెకు రెండు పొట్లములు దొరికినవి. వాని నామె భద్రము చేసికొని నదిని సమీపంబున కేగునంతలో, అందొక పెద్ద ముత్తయిదువ అయ్యో! నా చెంగున గట్టుకొన పసుపు కుంకుమము లెందో జారిపోయినవని వెదుకుకొనుచుండెను, విప్రకుమారి వెంటనే అమ్మా! నీ నుండి జారిపోయిన పొట్లములివిగోనని ఈయగ నామె సంతోషించి సౌభాగ్యసిద్ధిరస్తనుచు దీవించినది. పిదప వారిరువురు ఆ పసుపు రాసుకొని స్నానములు చేసి కుంకుమ బొట్లు పెట్టుకొనిన పిమ్మట ఆమె యింటికి తిరిగి చూచునంతలో చనిపోయిన భర్త తిరిగి జీవించి యుండుటగాంచి పరమాశ్చర్యము నొందెను.

 ఉద్యాపనము:- ఒక ముత్తయుదువను పిలిచి అలంకారముచేసి పిండి వంటలతో భోజనము పెట్టవలయును. క్రొత్తచీరయు రవికల నీయవలయును. వండిన పరమాన్నము ఆరిన తరువాత పై పొరయు దీసి, క్రింది పొరయుదీసి మధ్యనున్నదాన వాయన మీయవలయును. వ్రతలోపమైనను భక్తిలోపముగాని యెడల, ఫలము దక్కను.


మరింత సమాచారం తెలుసుకోండి: