గుమ్మడి గౌరీ నోము కథ
ఒక బ్రాహ్మణ కుమారునకు వివాహము జరిగి భార్య కాపురమునకు వచ్చినది. వారిరువురు చిలకాగోరింకవలె జంటాయక మహానందముగ కాపురము చేయుచుండిరి. ఒక దినమున యమదూతలు బ్రాహ్మణుని వద్దకువచ్చి ఓ బ్రాహ్మణోత్తమా! నీ కుమారునకాయువు తీరినది వాని ప్రాణములను గొనిరావలసినదిగా యమధర్మరాజు మమ్ము పంపినాడు. మీరు మహా పుణ్యాత్ములుగాన ముందుగ మీ యొద్దకు వచ్చితిమి. నీ కుమారుని మాకు ఇవ్వండని యడిగిరి.


చిన్ననాడే తన కుమారునకు ప్రాణగండమున్నదని ఆ బ్రాహ్మణునకు తెలియును. కాని అది తన కోడలి వలననే తీరగలదని తలంచిన కారణమున ఆ బ్రాహ్మణుడు, అయ్యాలారా! మీరువచ్చినపని మంచిదియేకాని, యిప్పుడు నా కుమారుడు వాని భార్య సమక్షమున నుండెను. మా కోడలితో చెప్పి వానిని తీసుకుపొండని తప్పుకొనెను. ఆ విషయమునంతయు వెంటనే గ్రహించిన బ్రాహ్మణుని కోడలు తన భర్తను గౌరీదేవి దేవాలయమునకుకొనిపోయి నాకు పతిభిక్ష ప్రసాదింపుమని అడుగగ పార్వతి యామెకు ప్రత్యక్షమై బిడ్డా! నీ మగని నిందేయుంచి నీవింటికి పోయి, గుమ్మడి గౌరీనోము నోచుకొనిరమ్మని పంపెను. 


ఇది యిట్లు జరుగునని తెలిసికొనిన యింటియజమాని కోడలు దేవాలయమునుండి యింటికి రాగానే ఆమెకావ్రత నియమము నుపదేశింపగా, ఆ చిన్నది వ్రతము పూర్తిగావించుకొని మరల దుర్గాలయమునకు చేరెను. అంతవరకు గుడివాకిటగ నిలబడియున్న యమభటులామెను చూడగానే "అమ్మా! గుమ్మడి గౌరీనోము నోచిన పుణ్యమువలన నీ పసుపు కుంకమ నీకు దక్కినని చెప్పి తిరిగిపోయిరి. 


ఉద్యాపనము:- నోము నోచినవారు సంవత్సరము వరకు గుమ్మడికాయ తినరాదు. ఒక ముత్తయిదువుకు మూడు గుమ్మడిపండ్లను యధాశక్తిగా దక్షిణ తాంబూలములతో కలిపి వాయనము నీయవలయును.

దీపదానము నోము కథ

దీపదానము నోము దివ్యముగాజేసి యిహలోక సౌఖ్యము లన్నియు పొంది అంతుపంతులేని యైదవతనము, వెలలేని మేటిబిడ్డలను గాంచి ఆయురారోగ్యములు అన్ని సిరులు, చివరకు మోక్షము చెందగలరు. యెవరయిన ఈ వ్రత మెప్పుడయిన చేయు అధికారము కలదని పెద్దలు చెప్పిరి. కార్తీక మాసము నుండి ప్రతిదిన ఈ పాటపాడుకొని అక్షింతలు వేసికొనుచుండవలయును. 

"దీప దానము, నోమునోచిన నెలతకు

పాపాలు పోవును పరమ పుణ్యము వచ్చు"

ఉద్యాపనము:- ప్రమిదలలో వత్తులువేసి నేతితో వెలిగించిన 33ప్రమిదలను శుక్త్యానుసారముగ దక్షిణతాంబూలములతో ఒక ముత్తయిదువునకు వాయనమియవలయును. ఆ ముత్తయిదువు బిడ్డలుగల పేదరాలగుట మంచిది. శక్తిగలిగిన వారు ఆ ప్రమిదలను యిత్తడి, రాగి, వెండి, బంగారముతో దేనిచేతనయినను చేయించి యియవచ్చును. వ్రతలోపమైనను భక్తి లోపము కానియెడల ఫలము దక్కును.

మరింత సమాచారం తెలుసుకోండి: