గ్రామ కుంకుమ నోము కథ
ఒక బ్రాహ్మణయువతి ప్రతిదినము గౌరినారాధించుచుండగ నొక దినమున గౌరి యామె స్వప్నమున కనపడి అమ్మాయీ! నీ భర్తకు కొద్ది రోజులలో ప్రాణాపాయము కలగనున్నది. నీవు ఆ సమయంబునందు గ్రామకుంకుమ నోముపట్టి మధ్యలో వ్రతోల్లంఘనము చేయక పూర్తి చేసినచో నీ మంగళ సూత్రము శాశ్వతముగ నిలిచియుండునని చెప్పెను. 

ఆమె అటులనే తన భర్తకు ప్రాణాపాయము సంభవింపనున్నదని కొనిన దినమున వీసె ఏబులం(కేజిన్నర), పసుపు, పసుపంత కుంకుమను కావిట్లలో వేయించుకొని తూర్పువీధిని పంచిపెట్టినంతలో, పెద్దకుమారుడు అమ్మా! నాన్నగారికి ప్రాణగండము సమీపించినదని రమ్మనగ ఆమె వ్రతము పూర్తిగావించుకొని వచ్చెదని చెప్పి పంపెను. దక్షిణపు వీధినీ పంచునంతలో, రెండవ కుమారుడు వచ్చి అమ్మా నాన్నగారు చనిపోయిరి, రమ్మనగ నామె వ్రతము పూర్తిగావించుకొని వచ్చెదని పంపెను. పడమవీధిని పంచునంతలో మూడవ కుమారుడు వచ్చి అమ్మా నాన్నగారు చనిపోయిరి, రమ్మనగ ఆమె వత్రము పూర్తిగావించుకొన వచ్చెదని పంపెను, ఉత్తరవీధిని పంచునంతలో నాల్గవ కుమారుడు వచ్చి అమ్మా! నాన్నగారి శవమును మోసుకొని పోవుచుండిరి రమ్మని పిలువగ ఆమె వత్రము పూర్తిగావించుకొని వచ్చెదని చెప్పి పంపెను. 

గ్రామమంతయు వ్రతము పూర్తి చేసుకొని కుంకుమ పంచిపెట్టిన తరువాత ఆమె శ్మశానమునకు పోయి చితిమీదనున్న భర్తను చేతితో తాకినంతనే, అతడు 'నిద్రనుండి లేచినవానివలె' లేచికూర్చుండగ అందరును మహాశ్చర్యమును పొందిరి.

ఉద్యాపనము:- పసుపు- కుంకుమలు 2కేజీల లెక్కన తరుగు లేకుండ గ్రామములో బజారులలో పంచవలెను.

చిలుక ముగ్గుల నోము కథ
పూర్వమొక రాజునకు సంతానము లేక నారాయణమూర్తిని గురించి తపస్సు చేయగ కొన్ని దినములకు ఆ శ్రీహరి ప్రత్యక్షమై ఓయి! నీవు చేసిన పూర్వజన్మలోని పాపము వలన నీకు సంతాన యోగ్యము లేదనెను. అందులకా రాజు నారాయణ మూర్తితో స్వామి! ఎటులైనను నాకు సంతానమును ప్రసాదించి తీరవలయును అని ప్రార్ధింపగా నా మహనీయుడు సరే ఐదవతనము లేని ఆడ సంతానం కలుగునని చెప్పి అదృశ్యమయ్యెను.

రాజునకు అటులనే స్త్రీ శిశువు జన్మించి దినదిన ప్రవర్ధమానముగ పెరిగి పెండ్లియిడునకు వచ్చినది. కాని ఆమె నెవరికిచ్చి వివాహము చేసినను అల్లుడు మరణించునను భయముతో కుమార్తెనొక కొండకిచ్చి పెండ్లిగావించెను. నారాయణమూర్తి వాక్ర్పభావంబున కొండంత పగిలిపోయినది. వైధవ్యము భరింపజాలని ఆ రాజకుమారియు నారాయణమూర్తిని గురించి ఘోరముగ తపసు చేసి మహానుభావా! నాకీ దుర్గతి ఎట్లుతీరునని ప్రార్ధింపగ ఆ దేవదేవుడు కరుణించి అమ్మాయీ! ఎవరేని చిలుకముగ్గులనోము నోచినవారు నీకా వ్రతఫలమును ధారపోసినచో నీకీ వైధవ్యము తొలగిపోవునని చెప్పెను. 

రాకుమారి తిరిగి తన నగరమునకు చేరుకొనుచు దారిలో నొక గ్రామంబున నున్న బ్రాహ్మణకన్య చిలుకముగ్గులనోము నోచినదని తెలిసికొని ఆమె పాదముల మీద పడి తన దీన చరిత్రనంతయు చెప్పికొని ప్రార్ధించగా నా బ్రాహ్మణకన్య తాను నోచిన, నోము ఫలితమును ధారపోయగనే పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై రాజకుమారిని, వివాహమాడిన పర్వతము, నొక సుందరమైన రాకుమారునిగా మార్చి, ఆమెకు తిరుగులేని ముత్తైదువతనమును ప్రసాదించిరి.

ఉద్యాపనము:- పదిహేను మానికల బియ్యముతో మండపము పోయవలయును. దామిమీద వెండి తులసికోటయు, బంగారపు తులసి కోటయు అమర్చవలయును. యథావిధిగ పూజించిన పిమ్మట 150మంది బ్రాహ్మణులకు పంచముగ్గులతో వెలిగించిన పదునైదేసి దారములుగల వత్తులతో వెలిగించిన దీపములను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములతో దానములీయవలయును.


మరింత సమాచారం తెలుసుకోండి: