సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. ఊరూవాడ సందడిగా మారే సరదాల పండుగ సంక్రాంతి. దూరతీరాల్లో స్థిరపడిన వారిని ఒకచోటికి చేర్చే కలర్‌ ఫుల్ ఫెస్టివల్. కొత్తధాన్యం ఇంటికి చేరి.. ఇంటిల్లిపాది సంతోషంగా జరపుకునే పండుగ. పిండివంటలు, ఆటపాటలతో వచ్చే సంక్రాంతి అంటే అందరికీ ఉత్సాహమే. రంగవల్లులు, గొబ్బిళ్లు, ఎద్దులు, కోళ్ల పందాలు, హరిదాసుల కీర్తనలు, భోగి మంటలు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నని చెప్పుకోవడం.... అన్నిటినీ మన ముంగిళ్లలోకి తీసుకొచ్చే తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి.  


సంక్రాంతి పండుగ అంటేనే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తోంది. తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ సంక్రాంతి. సాంప్రదాయాలకు పెద్దపీఠ వేసే ఈ పండుగకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. సంక్రమణము అంటే మారడం అని అర్థం. ఈ సంక్రమణము అనే పదం నుండి పుట్టిందే సంక్రాంతి. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల నుంచి.. ఉత్తర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుందో అపుడే సంక్రాంతి. పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతల గాలులు వీస్తూ.. మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసం జనవరి నెలలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున.. అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలోకి అడుగుపెడతాడు. అలా సూర్యుడు ఉత్తరాయణ పథంలోకి అడుగుపెట్టిన ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.


తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు..  భోగి, సంక్రాంతి, కనుమగా జరుపుకుంటారు. ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు జరుపుతారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు.. పొలాల నుంచి ఇంటికి తెచ్చిన కొత్త పంటతో.. భగవంతునికి పొంగలి నైవేద్యం చెల్లించి, వారిని విడిచివెళ్లిన పెద్దలకు వస్త్రం సమర్పించి కుటుంబాన్ని చల్లగా చూడమని నమస్కరిస్తూ ప్రార్థిస్తారు.


పండుగ నెల రోజుల ముందు నుంచే తెలుగు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. జంగందేవరుల శివ తత్వాలతో, హరిదాసుల హరినామ సంకీర్తనలతో, ప్రతి ఇంటి ముందు రంగవల్లులతో కలకలలాడుతుంటాయి. రకరకాల జానపద వినోద కళాకారులు ప్రతి ఇంటి ముందుకు వచ్చి ధానం స్వీకరించి, తమకు ధానం ఇచ్చిన ఇల్లు ధన, ధాన్య, సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆశీర్వచనాలు అందిస్తారు. ఆడపడుచులు ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మలతో, గొబ్బెమ్మలలో పసుపు, కుంకుమ, పూవులు, రేగిపళ్ళు, పోసి అలంకరిస్తారు. సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్లు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తారు. చాలా ప్రాంతాల్లో కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు కొత్త శోభను తెస్తాయి.


ఈ పండులో ప్రతిదానికి ఓ విశిష్టత ఉంది. పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే.. చిన్న పిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతంగా చెబుతారు. ఈ ముగ్గుల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్య స్త్రీలకు సంకేతం, మధ్యలో ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. భోగి పండ్లు అంటే రేగుపండ్లు. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.


సంక్రాంతి పర్వధినాన నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు.
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయ ఆకారంలో గల పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పే దానికి సంకేతంగా భావిస్తారు. 


ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. ఇలా సంక్రాంతి పండగ సందర్భంగా చేసే ప్రతి పని దైవంతో అనుసంధానికి సంకేతాలుగా నిలుస్తుంటాయి. అందుకే తెలుగు లోగిళ్లలో సంక్రాంతి అతిపెద్ద పండగ..


మరింత సమాచారం తెలుసుకోండి: