నాగమణి.. ఎన్నో శతాబ్దాలుగా మనిషిని ఆకర్షిస్తున్న విలువ కట్టలేని వజ్రం. అత్యంత పవిత్రమైన రత్నాల్లో నాగమణి ఒకటి. నాగమణి చెంత ఉంటే మరణం సంభవించదని.. సకల సంపదలు వచ్చిపడతాయని మనుషుల నమ్మకం. పురాణాల్లోనూ నాగమణి గురించిన ప్రస్తావన ఉంది. మరి అసలు నిజంగా నాగమణులు ఉంటాయా..? నాగుపాముల శిరసుపై ఉండేదేంటి..? 


పురాణాల ప్రకారం భూగర్భంలో ఏడు లోకాలుంటాయట. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాల్లో ఎన్నో జీవరాశులుంటాయి. వాటిని చాలామంది రాక్షసులు పాలిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. పాములకు రాజైన ఆది శేషు వేయి తలలతో భూమిని మోస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశేషు, వాసుకి… ఇలాంటి గొప్ప పాములన్నీ భూగర్భంలోనే ఉంటాయని ప్రతీతి. నాగుపాములు వీరికి ముఖ్య అనుచరులుగా ఉంటూ భూగర్భంలోని లోకాలను కాపాడుతూ ఉంటాయట.


పురాణాల ప్రకారం చూస్తే.. స్వాతి నక్షత్రం రోజున వర్షం పడే సమయంలో.. వర్షపు నీటి బిందువులు నాగు పాము నోటిలో పడితే.. ఆ నీటి బిందువులే మణిగా మారతాయని నమ్మకం. అసలు నాగమణి ఒక్క నాగుపాముల్లో మాత్రమే ఎందుకు తయారవుతుందో తెలుసా…? భూమి మీద వందేళ్ల కంటే ఎక్కువ కాలం బతికే పాము అదే కాబట్టి.. అందులోనే మణి తయారవుతుందని కొంతమంది చెబుతారు. ఒక్కసారి నాగమణి ఏర్పడితే.. ఆ పాముకి అపారమైన శక్తులు వస్తాయంట. అంటే నాగమణి ఉన్న పాము.. ఏ రూపాన్నైనా ధరించేగలిగే శక్తి కలిగి ఉంటుందట. ఎక్కువగా మానవ రూపం ధరిస్తూ ఉంటాయట నాగుపాములు.


అసలు నిజంగా నాగమణి ఉంటుందా..? అంటే కొంతమంది అవునని చెబుతారు. మరికొందరు కాదని చెబుతారు. పురాణాల విషయాన్ని పక్కన పెడితే… భూగర్భంలో ఎన్నో రకాల ఖనిజాలుంటాయి. వాటిలో కొన్ని వెలుగు పడితే వింత కాంతితో మెరుస్తూ ఉంటాయి. ఆ వెలుగును ఆధారంగా చేసుకొని భూగర్భంతో పాములు చిన్న పురుగులు, జీవులను ఆహారంగా తీసుకొని బతుకుతాయి. ఆ వెలిగే ఖనిజాలే.. నాగమణి అని చాలామంది భ్రమపడతారని నిపుణులు చెబుతారు.


నాగుపాము తలపై నల్లని మచ్చ లాంటి ప్రదేశం ఉంటుంది. మనకు తలలో ఎన్నో భాగాలున్నట్టే.. పాము తలలో కూడా ఎన్నో భాగాలుంటాయి. వాటిలో కొన్ని గట్టిగా రాయిలా ఉంటాయి. వాటినే మరికొంతమంది నాగమణి అని భ్రమపడి.. వాటి కోసం పాములను చంపేస్తుంటారు. తలపై ఉన్న గట్టి పదార్థాన్ని తొలగిస్తే.. ఆ పాము కచ్చితంగా మరణిస్తుంది. ఆ గట్టి పదార్ధం కొన్ని రకాల పాముల్లో నలుపు, తెలుపు, తేనె రంగు, పసుపు.. ఇలా ఎన్నో రంగుల్లో ఉంటుంది. అందుకే దాన్ని నాగమణిగా భావించే కొందరు పాముల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.


చరిత్రలో ఎక్కడా నాగమణి ఉన్నట్టు.. అది ఎవరికో ఒకరికి దొరికినట్టు చిన్న ఆధారం కూడా లేదు. కానీ డబ్బు కోసం వల వేసే మోసగాళ్లు.. అమాయకులను నమ్మించి మోసం చేసేందుకు నాగమణి ఉన్నట్టు ప్రచారం చేస్తూ.. లక్షల్లో దోచుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: