భారతీయ యువతరం, వీరి తల్లిదండ్రులు తెలిసికొని ఆచరించవలసిన కొన్ని ముఖ్యవిషయాల్లో ఈ ఉపనయన సంస్కారం ఒకటి. ముఖ్యంగా తెలిసికొనదగిన విషయాలు ఇందులో- ఉపనయనం అంటే ఏమిటి? దీని అవసరం ఎందుకు? వేదాలు చదువుకోని వారికి ఈ రోజుల్లో కూడా ఇది కావాలా? ఉపనయనం అవసరం అనుకుంటే ఎప్పుడు చేసుకోవాలి? చేసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? చేసుకుంటే లాభమేంటి? ప్రస్తుతం మనం ఆచరిస్తున్న విధానం ఎంతవరకు సార్ధకమౌతున్నది? వీటికి సమాధానాలు తెలిసికొని ఆచరించ గలిగితే మన జీవితాల ఈ పవిత్ర భారతదేశంలో జన్మించినందుకు చరితార్థమైనట్లే.

ఉపనయనం అంటే :

'ఉప' అంటే సమీపానికి, 'నయనం' అంటే చేర్చటం అని సాధారణార్ధం. యోగ్యుడు, సమర్ధుడూ అయిన గురువు సమీపానికి విద్యాభ్యాసానికై పిల్లవాడిని (శిష్యుడిని) తల్లిదండ్రులు చేర్చటం అని దీని అర్ధం. ఉపనయన సంస్కారానికి జ్ఞాన నేత్రాన్ని తెలిపించే సంస్కారమనే అభిప్రాయం కూడా పండితలోకంలో ఉంది. ఈ ఉపనయన సంస్కారం కొన్ని లక్షల సంవత్సరముల క్రితం మనువుచే ప్రారంభించబడింది. కొద్ది మార్పులతో ఇది సుమారు మూడు శతాబ్దాల క్రితం వరకు అదే పద్దతిలో అనుసరింపబడింది. ప్రస్తుతం ఇది ఒక మొక్కుబడిగానో లేక ఒక తంతుయ వేడుకలలో భాగంగానో ఆచరింపబడుతున్నది. కొద్ది మంది మాత్రమే దీన్ని సక్రమంగా అనుసరించి ఆచరిస్తున్నారు. ఆ మాత్రం ఉండ బట్టే దీన్ని గురించి మనం తెలుసుకొనే అవకాశం ఈ మాత్రమైనా ఉన్నది.

          ప్రాచీన కాలంలో 'అక్షరాభ్యాసం' కాకుండా ఉపనయనమే విద్యాభ్యాసారంభంగా ఉన్నట్లు తెలుస్తున్నది. 5వసంవత్సరంలోనో లేక పదో ఏటనో ఈ ఉపనయనం చేసేవారు. వేద విద్య శృతి, స్వరములకు సంబంధించింది కనుక అక్షరాలను దిద్దబెట్టటంతో కాకుండా, మంత్రములను ఉపదేశించి ఉచ్చరింప చేయటంతో విద్యాభ్యాసం ప్రారంభమయ్యేది. అన్ని శాస్ర్త విద్యలూ వేద విహితమైనవే కనుక వాటిని అధ్యయనం చేసి ఆచరించే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారికి నేడు ఉపనయనమే విద్యాభ్యాసారంభము.


మరింత సమాచారం తెలుసుకోండి: