"సౌరాష్ట్ర దేశే విశదేతిరమ్యే, జ్యోతిర్మయం చంద్రకళావతంనం |

భక్తిప్రదానాయ కృపావతీర్ణ తం సోమనాథం శరణం ప్రవద్యే ||"

                                                                   -శ్రీమద్ ఆదిశంకరాచార్య.

          జయ్ సోమనాథ్, జయ్ సోమనాథ్!

          ఈ జయఘోషతో గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతపు వేరావల్ హార్పర్ మరియు ఈ పరిసర ప్రాంతపు గ్రామమైన ప్రభానపట్టణం, దద్దరిల్లిపోతూండేవి.

          తోడుగా, మందిరఘట్టం యొక్క మెట్లను తాకే సముద్రపు అలలు కూడా 'జయ్ శంకర్, జయ్ శంకర్' అని నినాదం చేస్తున్నట్లు ధీర, గంభీరనాదం వినవస్తుంది. ఆ పై జయఘోషతో ఆ పరిసరమంతా భక్తిమయంగా ఉండేది.

          మందిరంలోని ఆ విశాల సువర్ణఘంట రెండు వందల మణుగుల బంగారంతో చేయబడింది. మందిరంలోని ఏభై ఆరు స్తంభాలు రత్నాలు, మాణిక్యాలు, ప్రచురవైఢూర్యాది మణులతో తాపడం చేయబడ్డాయి.

          మందిరపు గర్భగుడిలో రత్నదీపాల తళతళలు పగలూ రాత్రీ ఉండేవి. కన్నోజీ అత్తరుతో నందాదీపం సర్వవేళలా ప్రజ్వలితం అయి ఉండేది. ధనాగారంలో లెక్కలేనంత ద్రవ్యం సురక్షితంగా ఉండేది.

          భగవంతుని పూజాభిషేకాలకై హరిద్వారం, ప్రయోగ, కాశీల నుంచి గంధోదకం ప్రతిరోజూ తెప్పించేవారు. కాశ్మీరు నుంచి పూవులు వచ్చేవి. నిత్యపూజకై వేయిమంది బ్రాహ్మణులు నియమించబడ్డారు. మందిరపు దర్బారులో నృత్యగానాలకై సుమారు మూడున్నరవేల మంది నృత్యాంగనలు నియమితులై ఉండేవారు.

          ఈ ధార్మిక సంస్థానానికి పదివేల గ్రామాల ఉత్పాదనలు ఈనాం రూపకంగా అందుతూండేవి. శ్రీ శంకరుని పన్నెండు జ్యోతిర్లింగాలలో సోమానాథునిది ఆది జ్యోతిర్లింగంగా పరిగణించబడింది.

          ఇది స్వయంభూదేవ స్థానం అయినందున, ఎల్లపుడూ జాగృతం అయి ఉన్నందున లక్షలాది భక్తజనులు ఇక్కడికి వచ్చి పవిత్ర-పావనం అవుంటారు. భక్తగణాల ద్వారా అర్పితం అయ్యే కోట్లాది రూపాయల సంపదతో దేవస్థానపు నిధుల భండారం సదా నిండుగా ఉండేది. దీనికి తోడు అగ్ని పూజనొనరించే విదేశీ వ్యాపారులు తమ లాభాల నుండి కొంత భాగాన్ని ఈ పవిత్ర దేవాలయానికి సమర్పించుకోవటంతో, ఈ సంస్థానపు సంపద లెక్కలేనంత ఉండేది.

          సౌరాష్ట్రపు శ్రీ సోమనాథ్, నిజానికి శివతీర్థం, అగ్ని తీర్థం మరియు సూర్య తీర్థం. మొట్టమొదటగా చంద్రునికి ప్రసన్నం అయింది. అప్పుడు చంద్రుడు భారదేశంలో స్వప్రథమంగా శ్రీ శంకరుని దివ్యజ్యోతిర్లింగ స్థాపన చేసి దానిపై అత్యంత సుందరమైన స్వర్ణమందిరం నిర్మించాడు.

          స్కంథపురాణంలోని ప్రభానఖండంలో దీనికథ ఈయబడింది. కథ ఈ విధంగా ఉంది:-

          చంద్రుడు దక్షుడి ఇరవై ఏడుగురు కన్యలనూ వివాహమాడినా వారిలో రోహిణి అతనికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఆమెపై గల మోహ వ్యావోహంలో మిగిలిన ఇరవై ఆర్గురు భార్యలనూ నిర్లక్ష్యం చేసినందువల్ల వారు అవమానంగా భావించి ఖిన్నులైయారు. తమపతియొక్క నిర్లక్ష్యానికి గురయిన వారు, త మండ్రితో మొరపెట్టుకున్నారు. దక్షుడు అందుకు బాధపడి, చంద్రునికి రెండుసార్లు నచ్చచెప్పి చూశాడు. ఫలితం లేకపోయింది. దాంతో అతడు చంద్రుడిని "క్షయం" కమ్మని శపించాడు.

          దేవతలు చంద్రుని బాధ గ్రహించారు. వెంటనే బ్రహ్మవద్దకు వెళ్లి శాప నివారణోపాయం ఏమిటని అడిగారు. ప్రభాన పట్టణంలో మహామృత్యుంజయం నుంచి వృషభ ద్వజశంకర ఉపాసన చేయటం ఒక్కటే మార్గమని సూచించాడు. చంద్రుడు ఆరు నెలలపాటు శివపూజగావించి శంకరుడిని ప్రసన్నం చేసుకున్నాడు. శంకరుడు ఒక పక్షంలో చంద్రునికి ఒకొక్క కళగా తగ్గుతూ వస్తుందనీ, రెండవ పక్షంలో ప్రతీ రోజూ పెరుగుతూ ఉంటుందనీ వరం ఇచ్చాడు. ఇది విని దేవతలు సంతోషించి ఆ క్షేత్ర మహిమ పెంచేందుకై మరియు చంద్రుని శోభను వృద్ధి చేసేందుకై సోమేశ్వరుడనే పేరుతో శివుణ్ణి అక్కడ ప్రతిష్టించారు. అక్కడ దేవతలు సోమేశ్వర కుండాన్ని స్థాపించారు. ఈ కుండం(కోనేరు)లో స్నానం చేసి సోమేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, పూజవల్లూ, సకల పాపాలు శమించి, ముక్తి ప్రాప్తిస్తుంది.

          చంద్రునికి సోముడనే పేరు కూడా ఉంది. అందువల్లే ఈ జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధి గాంచింది. ఇక్కడే చంద్రునికి అతని తేజస్సు లభించింది. అందువల్ల ఈ స్థానానికి ప్రభాన పట్టణం అనికూడా పేరు వచ్చింది.

          తరువాత రావణుడు రూప, కృష్ణుడు చందనంతో ఈ విధంగా మందిరాన్ని నిర్మించారు. సొరటి సోమనాథుని పరిసరాల్లో విస్తరించి ఉన్న అనేక పౌరాణిక స్థానాలలో గల కథల గురించి చివరలో ప్రస్తావించబడింది.

          శ్రీ సోమనాథుని ఈ వైభవ సంపన్న విత్ర స్థానంపై ముస్లిమ్ లు అనేకమార్లు ఆక్రమణ చేశారు. క్రీ.శ.722లో సింథ్ సుబేదారు జునామద్ మొదటిసారి ఆక్రమణ చేసి ఖజానా నుండి అంతులేని సంపదను కొల్లగొట్టాడు.

          చుంబకీయ అద్భుత(సూదంటురాయి) కౌశల్యం వల్ల మధ్యలోనే కనిపించే శ్రీసోమనాథుని భవ్యమైన మూర్తిని గజనీ మహ్మద్ క్రీ.శ 1025 మే11, శుక్రవారం ఉదయం 9.46గంటకు విచ్ఛేదం చేశాడు. అప్పటి నుండి గజనీ మొహమ్మద్ ను "మూర్తిభంజకుడు" అని పిలుస్తారు.  ఆరోజున అతడు 18కోట్లు ఖజానా నుండి కొల్లగొట్టాడు.

          క్రీ.శ.1297లో అల్లాఉద్దీన్ ఖిల్జీ తన సర్దాయిన అల్తాఫ్ ఖాన్ ను సొరటీ సోమనాథ్ పంపి మందిరాన్ని విధ్వంసం చేయించాడు. క్రీ.శ. 1479లో మహమ్మద్ బేగడా. క్రీ.శ. 1503లో రెండవ ముజప్ఫర్ షా మరియు క్రీ.శ. 1701ధర్మాంధుడైన ఔరంగజేబు సోమనాథ మందిరాన్ని భగ్నం చేసి, విరగొట్టి నాశనం చేసి, ఎంతో మందిని హత్యగావించి, లెక్కలేనంత సంపదను కొల్లగొట్టారు.

          క్రీ.శ.1783 శివభక్తురాలు, సాధ్వి అయిన అహిల్యాబాయిహోల్కర్ సోమనాథ మందిరాన్ని నిర్మించింది. భారతదేశం స్వాతంత్రం పొందాక గుజరాత్ సింహం, వల్లభాయి పటేల్, మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ గాడ్గిల్ యొక్క సలహా ప్రకారం శ్రీసోమనాథ మందిరపు శిథిలోద్ధారణ జరిగింది. "భారతీయ శిల్ప కళ యొక్క స్వర్గుతల్యమైన సౌందర్యానికి ఇదొక అపూర్వ ప్రతీక" అనే భావనతో, విశ్వపు దృష్టిని ఈ మందిరంవైపు ఆకర్షితం చేయటం జరిగింది.

          శుక్రవారం 11మే, 1951లో ఉదయం 9.46గంటలకు ఈ మందిరంలో శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం  యొక్క ప్రాణప్రతిష్ట జరిగంది. అప్పటి భారత రాష్ట్రపతి. గౌ.డా. రాజేంద్రప్రసాద్ గారి కరకమలాల ద్వారా, వేదమూర్తి, తర్కతీర్ధులు శ్రీలక్ష్మణ శాస్త్రి జోషీగారి వేదమంత్రోచ్ఛారణలతో వైభవోపేతంగా ఈ ప్రాణప్రతిష్ట జరిగింది.

          భారతదేశపు ఈ ఆది జ్యోతిర్లింగం కోట్లాది భక్తజనులకు శ్రద్ధాస్థానం. లక్షలాది యాత్రీకులతో ఇక్క ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అనేక సిద్ధ-సత్పురుషుల సత్సాంగత్యం ప్రజలకు ఇక్కడ లభిస్తూంటుంది. దాతల దానంతో శ్రీ సోమనాధుని వైభవంలో తిరిగి వృద్ధి కానవస్తోంది. నాస్తికులు మందిరాన్ని ఎంతో విమర్శించారు. కానీ, భారతీయు శ్రద్ధాభక్తులనూ, అభిమానాన్నీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. దీనికి సాక్షాత్ నిదర్శనమే శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం.

          సముద్ర తీరంలో కఠియవాడ్ ప్రదేశంలో ప్రధాన పట్టణపు పరిసరాల్లో మందిరాలు, స్మారక చిహ్నాలు మరియు పౌరాణిక స్థానాలూ ఉన్నాయి. వాటి కథలు పురాణ ప్రసిద్ధాలు. వాటిలో సూర్య మందిరం అతి ప్రాచీనమైనది అందులో విగ్రహం లేదు. కానీ మందిరపు ప్రాచీన శిల్పకళావశేషాలు చూసినా చాలు ఆ కళ ఎంత ఉత్కృష్టటమైనదో తెలుసుకోటానికి.

          భద్రకాళి మందిరం అతి ప్రాచీనమైంది. దాని ప్రవేశద్వారం వద్ద దక్షిణవైపు గల గోడపై యాభైయొక్క కావ్యపంక్తుల శిలాలేఖనం ఉంది. దానిపై రాజా కుమారపాలుడు కట్టించిన మందిరాలూ, చేసిన దానధర్మాల వివరాలూ చెక్కబడి ఉన్నాయి.

          భల్లాంతక తీర్ధ (భాలుక)- శ్రీకృష్ణ భగవానుని ఎడమకాలి వేలుపై దర్భబాణం తగిలి రక్తం కారిన స్థానం. దీనినే భల్లాంతక తీర్ధం అంటారు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని విగ్రహం ఉంది. ఇక్కడే అర్జునుడు సుభద్రను పొందాడు. కార్తీక పౌర్ణమినాడు ఇక్కడ ఒక పెద్ద మేళా జరుగుతుంది.

          కాఠియవాడ్ లోని ఈ కుశావ్రతంలో శ్రీకృష్ణ భగవానుడు స్వర్ణద్వారకను నిర్మించాడు. తదుపరి ఈ కుశదర్భతో తయారయిన ముసలం వల్లనే యాదవుల వినాశనం జరిగింది. శ్రీకృష్ణుడు, బలరాముడు ఈ ఘటనవల్ల ఎంతో ఖిన్నులయ్యారు. బలరాముడు సముద్ర ప్రవేశం చేశాడు. అక్కడ ఒక సముద్ర గర్భపు గుహలో దూరి తన అవతార సమాప్తి చేశాడు. నేటికీ ఆ గుహ కనిపిస్తుంది.

          దేహోత్సర్గ అనే ఈ చోట హిరణ్య అనే నదిపై ఒక విశాల ఘట్టం నిర్మితమై ఉంది. శ్రీకృష్ణుని అంత్యక్రియలు ఇక్కడే జరిగాయట. ఇక్కడ అనేక స్తంభాలపై నిలిచిన ఒక భవ్యస్మారకం మరియు గీతా మందిరమూ కూడా కట్టబడి ఉన్నాయి.

          శ్రీకృష్ణ భగవానుని పార్ధివ శరీరపు అగ్ని సంస్కారం చేసిన చోట భగవానుని స్పటిక విగ్రహం సందర్శించినపుడు, ఆయన సంపూర్ణ జీవన వృత్తాంతం మన కళ్లకు కట్టినట్లు చుట్టూ గిర్రున తిరుగుతుంది. మధురలో కారాగారంలో జన్మించి, గోకులంలో నందుని ఇంట బాల్యం గడిపి పెరిగాడు. కంసుని రాజదర్బారులో ప్రవేశించి, ఆ రాక్షసుణ్ణి వధించాడు. బృందావనంలో గోపికలతో రాసలీలలు సలిపాడు. సందీపని ఆశ్రమంలో విద్యాభ్యాసం తరువాత నూతన నగరం నిర్మించి ద్వారకా ధీశుడైనాడు. కురుక్షేత్రపు మహాభారత యుద్ధంలో అర్జునికి రథసారథ్యం వహించి, పాండవులకు విజయం ఒనగూర్చాడు. గీతా స్వరూపంలో విశ్వానికి అమరసందేశం విడిచాడు. యాదవుల గృహకలహాల అనంతరం శ్రీకృష్ణభగవానుడు ఒక వేటగాడు విడిచిన రెల్లు బాణాన్ని నిమిత్తం చేసుకొని, తన అవతార సమాప్తి గావించాడు. శ్రీకృష్ణ భగవానుని సత్సాంగత్యం ఎవరైతే పొందారో వారు ధన్యులు. పూర్ణపురుషుడు అయిన శ్రీకృష్ణుని జీవిత సంగ్రహం ఈ విధంగా విగ్రహదర్శన సమయంలో జ్ఞప్తికి వస్తుంది.

          ప్రధాన పట్టణ పరిసరాలలోనే, అలనాడు అగస్త్యముని సముద్రాన్ని ఔపోసన పట్టాడు. పాండవులు, జనమేజయుడు, రావణాది అనేక ప్రసిద్ధ పురాణ పురుషులు ఈ భానకర ప్రభాస పట్టణ తీర్ధం దర్శించారు. మాఘమాసపు శివరాత్రి నాడు సోమనాథ జ్యోతిర్లింగ మహోత్సవం అట్టహాసంగా జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: