శనిగ్రహాన్ని నిగ్రహించిన మహర్షి "పిప్పలాదుడు"  పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ . ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఈ కారణంగానే ఆ పిల్లవాడికి " పిప్పలాదుడు" అనే పేరు వస్తుంది.


ఆ పిల్లవాడి పరిస్థితి బాధకలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు.ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి ఆయన సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు.


పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని ఆయన అడుగుతాడు. శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు.


ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెబుతారు. ఆయన శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు. అందువలన శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.


పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం
నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||


మరింత సమాచారం తెలుసుకోండి: