పురాణగాథల ప్రకారం యమునా నది- యమధర్మరాజుకు చెల్లెలు. ఆమెకు అన్నగారంటే వల్లమాలిన ఆపేక్ష. తన ఇంటికి రమ్మని, తన చేతివంట భుజించి వెళ్ళమని, ఎన్నిసార్లో సోదరుణ్ని ఆమె అభ్యర్థించింది. కోరగా, పోరగా ఒకనాడు యముడు సోదరి ఇంటికి వచ్చాడు. ఆరోజు కార్తీక శుద్ధ విదియ. చిత్రగుప్తునితోసహా విచ్చేసిన యముణ్ని, అతని పరివారాన్ని- యమున ప్రీతిగా స్వాగతించి, స్వయంగా వంటచేసి, విందుభోజనాలతో అందరినీ చక్కగా సంతుష్టులను చేసింది.

Image result for భగినీ హస్తాన్న భోజనం యమున

చెల్లెలి ఆప్యాయతకు యముడు మురిసిపోయాడు. ఏదైనా వరం కోరుకోమ్మన్నాడు. ఆరోజు అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యు భయం, నరకలోకప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని అనుగ్రహించమని యమున తన సోదరుణ్ని కోరింది. ప్రతిఏటా కార్తీక శుద్ధ విదియను అందుకు తగిన రోజుగా నిర్ణయిస్తూ, ప్రతిఏటా ఆనాడు ఇంటికి వచ్చి చెల్లెలి చేతివంట తిని, వెళతానని యమధర్మరాజు ఆమెకు మాట ఇచ్చాడు.
Image result for భగినీ హస్తాన్న భోజనం
లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎన్నడూ అకాల మృత్యువు దరిచేరదని, నరకలోకభయం ఉండదని హామీ ఇచ్చాడు. అంతేకాదు, ఆరోజు ఏ స్త్రీ తన సోదరులను పిలిచి అన్నంపెట్టి ఆదరిస్తుందో- ఆమె జీవితాంతం సుమంగళిగా జీవిస్తుందని, భోగభాగ్యాలతో తులతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు.


పురాణగాథలను అనుసరించి యముడికి, యమునకు మధ్య ఈ ఉదంతం కార్తీకమాసం రెండోరోజు విదియనాడు జరిగింది కాబట్టి, దాన్ని 'యమద్వితీయ'గా పాటించటం ఆనవాయితీ అయింది. స్మృతికౌస్తుభం దీన్ని యమద్వితీయగానే ప్రకటించింది. సోదరుడిపట్ల సోదరి ప్రేమకు ప్రతీకగా- దీన్ని 'భ్రాతృవిదియ'గా పరిగణించడమూ పరిపాటి అయింది. చతుర్వర్గ చింతామణి సహా అనేక గ్రంథాల్లో దీని ప్రస్తావన వస్తుంది. ఆమె చేతివంటకు ప్రత్యేకతను, పవిత్రతను ఆపాదిస్తూ 'భగినీ హస్తాన్న భోజనం' అని పిలవడం లోకంలో సంప్రదాయంగా స్థిరపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: