ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ప్రస్తుతం అమెరికాలో ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో పాల్గొంటున్న భారతీయ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒకే ఒక్క ట్వీట్‌తో బ్రిటిష్ ఎయిర్ వేస్ ప్రతిష్టను మంటగలిపేసాడు. ఈ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ తన ప్రయాణీకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు నచ్చని సచిన్  తన అసమ్మతిని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. దానికి బ్రిటిష్ ఎయిర్‌వేస్ స్పందించిన తీరు క్షణాల్లో దాని పేరు ప్రఖ్యాతులను కూల్చివేసింది.


వివరాల్లోకి వెళితే ఆల్ స్టార్స్ క్రికెట్‌లో పాల్గొంటున్న క్రికెటర్ల కుటుంబ సభ్యులకు సీట్లు ఖరారు చేయడానికి బ్రిటిష్ ఎయిర్‌వేస్ నిరాకరించింది. సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ సంస్థ క్రికెటర్ల కుటుంబ సభ్యులకు వాటిని బదలాయించలేదు. ఇది సచిన్‌కు చిరాకు తెప్పించింది. పైగా సచిన్ లగేజ్‌‌పై తన పేరు కాకుండా మరొకరి పేరు జోడించి కలిపేయడంతో సచిన్ ఆగ్రహం ఆపుకోలేకపోయాడు. వెంటనే ఈ ఉదంతాన్ని ట్విట్టర్‌లో పెట్టేశాడు.


అంతే ఒక్కసారిగా ట్విట్టర్‌లో సచిన్ అభిమానులు రేగిపోయారు. విమర్శల దాడితో బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ను ముంచెత్తారు. బిత్తర పోయిన బ్రిటిష్ ఎయిర్ వేస్ తప్పు సవరించుకునే ప్రయత్నంలో భాగంగా తన పూర్తి పేరు తెలపాలని సచిన్‌కు నేరుగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ అలా వెళ్లిందో లేదో.. సచిన్ అబిమానులు వెర్రెత్తిపోయారు. ఈ భారతీయ దిగ్గజం పూర్తి పేరు కూడా తెలియనందుకు వారు బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ను కడిగిపారేశారు.


బ్రిటిష్ ఎయిర్ వేస్ కోట్లాది పౌండ్లు వెచ్చించి సాదించుకున్న ప్రచారం మొత్తంగా ఒకే ఒక ట్వీట్ కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. సోషల్ మీడియా ఎంత ప్రభావ శీలమైందో తెలుసుకోవడానికి ఈ ఒక్క ట్వీట్ చాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: