అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఇంటి వంటగదిలో తనను చపాతీలు చేసిపెట్టడానికే పరిమితం చేశారని ఇటీవలే విడాకులు పుచ్చుకున్న ఆయన రెండో భార్య రెహామ్ ఖాన్ వాపోయారు. పైగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటి బయటకు రావద్దంటూ తనపై ఆంక్షలు విధించారని ఆమె ప్రకటించారు. బీబీకీ రీజనల్ న్యూస్‌ చానెలలో పనిచేస్తూ మంచి కెరీర్‌ను వదులుకున్న రెహామ్ 2013లో పాకిస్తాన్ చేరుకున్నారు. తర్వాత ఇమ్రాన్‌తో పరిచయం పెళ్లివరకు దారితీసింది. ఎంతో ఆశలతో ఆయన బంగాళాకు వెళ్లిన రెహామ్ కేవలం పది నెలలకే అక్కడి జీవితంపై విసుగెత్తి పోయి విడాకులు పుచ్చుకున్నారు.


ఇమ్రాన్ ఇంటికి వెళ్లిన తర్వాత గాని తనకు అసలు నిజం తెలియలేదంటూ రెహామా వాపోయారు. వారు తనను వంటగదిలో చపాతీలు చేస్తూ ఉండాలని, బయటి ప్రపంచంకేసి చూడకుండా నాలుగ్గోడల మధ్యే ఉండిపోవాలని మాత్రమే భావిస్తున్నట్లు సీనియర్ సలహాదారు చెప్పారని కాని అక్కడికి వెళ్లాక కానీ వాస్తవం ఏమిటో తనకు అర్థం కాలేదని ఇమ్రాన్ మాజీ భార్య చెప్పారు. పెషావర్‌లో వీధిపిల్లల తరపున అంబాసిడర్‌గా పనిచేస్తున్న తాను కుటుంబంలో ఆంక్షల కారణంగా వారికి ఏమాత్రం న్యాయంచేయలేకపోయానని రెహామ్ వాపోయారు.


రెండు సార్లు విహాహం చేసుకున్న తర్వాత కూడా మీరు కుటుంబంలో దూషణభూషణలకు గురయ్యారా అంటూ ఒక టీవీ చానల్‌ వేసిన ప్రశ్నకు రెహామ్ జవాబిస్తూ తాను అబద్దం చెప్పాలనుకోవటం లేదని చెప్పిన సమాధానం ఇమ్రాన్‌తో ఆమె దాంపత్య జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. పైగా ఇమ్రాన్ ఇంట్లో అతిథులకు పెద్దగా పరిచర్యలు జరిగేవి కావని, ఇమ్రాన్ సైతం రోజుకు ఒకే ఒక చపాతీతో సంతృప్తి చెందుతుంటారని ఆమె అమాయకంగా చెప్పిన మాట వారి దాంపత్య జీవితంపై ప్రభావం చూపింది.


తనకు అర్థమయిందేమిటంటే రాజకీయా్లో పూర్తిగా నిమగ్నమై ఉండే ఇమ్రాన్ వివాహ జీవితానికి తగినంతగా సమాయత్తం కాలేదని రెహామ్ చెప్పారు. తనతో రాజకీయాలను తప్పితే ఏ విషయాన్ని చర్చించడం కుదరదని, ఇంట్లోని కర్టెయిన్ల రంగుల గురించి అతడితో చర్చించలేమన్నారు. బాలీవుడ్ సినిమాలపై అతనితో చర్చించడం కూడా అసాధ్యమేనని ఆమె తెలిపారు.
తనను ప్రేమిస్తానని, బాగా చూసుకుంటానని నచ్చబలికినందునే ఇమ్రాన్‌ను తాను పెళ్లి చేసుకున్ననని, కాని అతడు కుటుంబ జీవితంలో ఎప్పడూ ఒంటరితనంతోనే గడిపేవాడని రెహామ్ చెప్పారు. జీవితం పట్ల లక్ష్యాల పట్ల తమకు ఒకే రకమైన భావాలు ఉన్నాయని తను భావించానని కానీ తాము పూర్తిగా భిన్నమైన వ్యక్తులమని ఆలస్యంగా తెలిసిందని రెహామ్ వాపోయారు. ఇప్పుడు తాను స్వేచ్చగా పాకిస్తాన్‌లోని వీధి పిల్లలకు సంబంధించిన పనిలో పాలుపంచుకోవడానికి పథకాలు రచిస్తున్నానని, రెండు సినిమాలు కూడా తీస్తున్నానని రెహామ్ ఆశాభావంతో చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: