ముంబై వాంఖడే స్టేడియం.. సెమీ ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్.. మ్యాచ్ పూర్తిగా వెస్టిండీస్ చేతిలోకి వెళ్లిపోయింది. విండీస్ బ్యాట్స్ మెన్ సిక్సులు, ఫోర్లు బాదుతున్నారు. చివరి ఓవర్లో 8 పరుగులు కొడితే విజయం విండీస్ సొంతం అవుతుంది. అప్పుడు బౌలింగ్ ఏ బౌలర్ కు ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినా బాదేస్తారు.. ఆ సమయంలో ధోనీ ఓ ప్రయోగం చేశాడు. బ్యాట్స్ మెన్ అయిన విరాట్ కోహ్లీ చేతిలో బంతి పెట్టేశాడు.

ధోనీ నిర్ణయం క్రికెట్ విశ్లేషకులను జ్ఞాపకాల్లోకి లాక్కెళ్లింది. 1994 హీరో కప్ ను గుర్తు చేసింది. అప్పుడు సేమ్ సీన్.. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్. చివరి ఓవర్లో కేవలం మూడు పరుగులు సాధిస్తే సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది. అనూహ్యంగా బంతిని అప్పటి కెప్టెన్ అజారుద్దీన్ సచిన్ చేతిలో ఉంచాడు.. బంతినికి చిత్ర విచిత్రంగా స్పిన్ తిప్పిన సచిన్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి భారత్ ను గెలిపించాడు.

విరాట్ కోహ్లీ కూడా విండీస్ తో మ్యాచ్ తో ఆ మాయాజాలం రిపీట్ చేస్తాడేమో అని విశ్లేషకులు చిన్నపాటి ఆశ పెట్టుకున్నారు. కోహ్లీ వేసిన మొదటి బంతికి పరుగు ఇవ్వలేదు. రెండో బంతికి కేవలం ఒక సింగిల్ మాత్రమే వచ్చింది. మళ్లీ హీరోకప్ మ్యాజిక్ రిపీటవుతుందా.. రీసెంటుగా బంగ్లాదేశ్ పై విన్నింగ్ సీన్ రిపీటవుతుందా.. అని అభిమానుల్లో చిన్న ఆశ.

కానీ ఆ ఆశలను విండీస్ బ్యాట్స్ మెన్ రసెల్ చిదిమేశాడు.. మూడో బంతిని ఫోర్ బాదేశాడు.. నాలుగో బంతిని ఏకంగా సిక్సర్ బాదేశాడు.. అంతే.. విండీస్ విజయం సాక్షాత్కారమైంది. సెమీస్ విజేతగా విండీస్ నిలిచింది. ఆదివారం ఇంగ్లాండ్ తో జరిగే పోరులో ఈ టీ 20 ప్రపంచకప్ విజేత ఎవరో తెలిసిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: