ఆకలితో ఉన్న సింహానికి ఆహారం దొరికితే ఎలా ఉంటుందో అలానే సరిగ్గా ఓ సూపర్ విక్టరీ కోసం ఎదురుచూస్తున్న బెంగుళూరు ఆటగాళ్లకు తమ ఆకలి తీర్చే విజయం అందించింది గుజరాత్ జట్టు. శనివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో గుజరాత్ జట్టుని ఏకంగా 144 పరుగుల తేడాతో ఓడించి తామెంత కసితో ఉన్నామో చూపించారు బెంగుళూరు ఆటగాళ్లు.


వరుసగా మ్యాచ్ లు ఓడుతూ వస్తున్న ఈ తరుణంలో జట్టు విజయం కీళకమైన సందర్భంలో బెంగుళూరు ఆటగాళ్లు గుజరాత్ బౌలర్లను చీల్చి చెండాడారు. ఇక ఫాంలో ఉన్న కొహ్లి, డివిలియర్స్ అయితే గుజరాత్ లయన్స్ కు చెమటలు పట్టించేశారు. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు భారీ స్కోర్ లక్ష్యంగా ఆడింది. 


కొహ్లి, డివిలియర్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టుకి నిర్ణీత ఓవర్లలో 248 పరుగులు సాధించారు. విరాట్ కొహ్లి 109 పరుగులు చేయగా.. ఏబి 129 నాటౌట్ గా నిలవడం విశేషం. 229 పరుగుల భాగస్వామ్యంతో బెంగుళూరు భారీ స్కోర్ ను సాధించింది. అంతేకాదు ఈ ఐపిఎల్ లో సన్ రైజర్ మీద బెంగుళూరు సాధించిన 227 రికార్డ్ బ్రేక్ అయ్యింది.


ఇక 249 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ లయన్స్ వికెట్లు వెంట వెంటనే పడ్డాయి. ఓపెనర్లు డ్వేన్ స్మిత్, మెక్ కల్లం తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో గుజరాత్ కష్టాల్లో పడ్డది. గుజరాత్ ఆటగాళ్లలో ఫించ్ ఒక్కడే 37 పరుగులు అత్యధిక స్కోర్ చేశాడు. ఇక 18.4 ఓవర్లోనే గుజరాత్ 104 పరుగుల అత్యల్ప స్కోర్ కు ఆలౌట్ అవ్వడం జరిగింది. ఈ విక్టరీతో బెంగుళూరు తమ సత్తా ఇది అని చాటింపేసినట్టు కాగా.. ఐపిఎల్ టోర్నిలో అత్యంత భయంకరమైన జట్టుగా బెంగుళూరు తమ ప్రదర్శనను చూపించింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: