అమ్మాయిలు అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోరు. ఇది చాలాకాలంగా నిరూపితమవుతూ వస్తోంది. ఇప్పుడు క్రికెట్ లో కూడా మహిళలు .. పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. సచిన్, కోహ్లీలాగా.. తాము కూడా పెద్ద పెద్ద ఇన్నింగ్స్ ఆడగలమని, రికార్డుస్థాయి స్కోర్లు సాధించగలమని చాటిచెప్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ హర్మన్ ప్రీత్ కౌర్.


ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్. ప్రత్యర్థి బలమైన ఆస్ట్రేలియా. పన్నెండేళ్లుగా ఊరిస్తున్న ఫైనల్ బెర్తుకోసం భారత మహిళల జట్టు విజయమో.. వీరస్వర్గమో అన్నట్టు పోరాడింది. ఇందులో ప్రముఖపాత్ర పోషించింది హర్మన్ ప్రీత్ కౌర్. 115 బంతుల్లో 171 పరుగులు.. వినడానికే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె నైపుణ్యం అనిర్వచనీయం. ఇది అద్వితీయ ఇన్నింగ్స్. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే వ్యక్తిగత హైయెస్ట్ స్కోర్.


హర్మన్ ప్రీత్ చరిత్రను తిరగరాసింది. ఆమె పోరాటం ఆస్ట్రేలియాపై ప్రతిసారి ఎదురవుతున్న పరాజయానికి ముగింపు పలికింది. ప్రపంచకప్ క్రికెట్ లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన హర్మన్ ప్రీత్ .. ఆ తర్వాత విశ్వరూపాన్ని చూపించింది. 50 పరుగుల వరకూ ఆమె నెమ్మదిగా ఆడింది. ఆ తర్వాత శివాలెత్తిపోయింది. 90 పరుగుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం కేవలం 17 పరుగుల్లోనే 50 పరుగులు రాబట్టిందంటే ఎలా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 171 పరుగుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులు ద్వారా సాధించినవే కావడం విశేషం.


హర్మన్ ప్రీత్ కౌర్ కు వీరేంద్ర సెహ్వాగ్ ఆంటే విరాభిమానం. సెమీ ఫైనల్లో హర్మన్ ఆట సెహ్వాగ్ నే తలపించింది. ప్రతి బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితం ఆసీస్ పై ఘన విజయం.


హర్మన్ విధ్వంసం భారత జట్టును సునాయాసంగా ఫైనల్స్ కు చేర్చింది. ఫైనల్లో ఇంగ్లండ్ తో తలపడనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: