ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతమైపోయింది. ప్రతి వస్తువు తయారీలోనూ ఇప్పుడు వినియోగం చాలా ఎక్కువవుతోంది. నాణ్యంగా ఉండటం, చవగ్గా ఉండటం, తేలిగ్గా ఉండటం వంటి కారణాలతో ప్లాస్టిక్ పై మోజు పెరిగిపోతోంది. అయితే ఈ ప్లాస్టిక్ ప్రపంచానికే పెను ముప్పు అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ అంత సులభంగా నాశనమైపోదు. 

ఒక ప్లాస్టిక్ వస్తువు మట్టిలో కలసిపోవాలంటే.. కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. సో.. ఇప్పుడు లక్షల టన్నుల కొద్దీ పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలే ఇప్పుడు మానవాళికి ముప్పుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ గొప్ప వార్త ప్రపంచానికి ఊరటనిస్తోంది.  పర్యావరణాన్ని పరిరక్షించే అద్భుత ఆవిష్కరణను జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 

ప్లాస్టిక్ వ్యర్థాలను తిని బతికే ఓ సరికొత్త బ్యాక్టీరియాను జపాన్ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. రాజధాని టోక్యోకు దూరంగా ఉన్న ఓ ప్లాస్టిక్ రీ సైక్లింగ్ సెంటర్ పరిసరాల్లో ఈ బ్యాక్టీరియాను వారు కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియాను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే టన్నులకొద్దీ పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను అది సింపుల్ గా తినేస్తుందట. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య తీరిపోతుందన్నమాట.

గతంలోనూ ప్లాస్టిక్ ను తినే కొన్ని జాతుల ఫంగస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ ఓ బ్యాక్టీరియా జాతిని కనుగొనడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ఫంగస్ తో పోలిస్తే బ్యాక్టీరియాను పునఃసృష్టించడం చాలా తేలిక. అందుకే ఈ కొత్త బ్యాక్టీరియా ప్లాస్టిక్ సమస్య నుంచి బయటపడేస్తుందని సైంటిస్టులు నమ్ముతున్నారు. అదే నిజమైతే అంతకుమించి కావల్సిందేముంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: