రుతుపవనాలు.. భారత్ వంటి వ్యవసాయ దేశంలో సామాన్య జన జీవితం వీటిపైనే ఆధారపడి ఉంటుంది. రుతుపవనాల రాకడపైనే వర్షపాతం, వ్యవసాయం.. వీటి ఆధారంగా పనిచేసే ఇతర రంగాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి రుతుపవనాల రాకను ముందుగానే తెలుసుకునే వీలుంటే బావుంటుంది కదా. ఇప్పటికే ఈ సదుపాయం ఉన్నా.. మరింత ముందుగానే రుతుపవనాల రాకడను ఇప్పుడు కనిపెట్టవచ్చట.

భారత్ లో రుతుపవన ఆగమనాన్ని రెండు వారాల ముందుగానే అంచనా వేసే కొత్త విధానాన్ని యూరప్ శాస్త్రవేత్తల బృందం కనిబెట్టింది. ఉష్ణోగ్రతలో చోటుచేసుకుంటున్న మార్పులు... పశ్చిమతీరం, ఉత్తర పాకిస్థాన్  ప్రాంతాల్లో తేమ ఆధారంగా రెండు వారాల ముందుగానే రుతుపవనాల రాకను అంచనా వేయొచ్చని స్విట్జర్లాండ్ కు చెందిన వాతావరణ పరిశోధన సంస్థ ప్రకటించింది.

ప్రస్తుతం భారతీయ వాతావరణ సంస్థ వారం రోజుల ముందు మాత్రమే రుతుపవనాల రాకను అంచనా వేస్తోంది.  తమ దగ్గరున్న పరిజ్ఞానాన్ని భారత్ కు ఉచితంగా అందజేసేందుకు స్విస్  శాస్త్రవేత్తలు అంగీకరించారు. దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖకు లేఖ కూడా రాసినట్టు తెలిపిన శాస్త్రవేత్తల బృందం.. ఏడాదిలో 125వ రోజు.. అంటే మే 5న రుతుపవనాల ఆగమన విషయాన్ని వెల్లడిస్తామని తెలిపింది.

సంవత్సరంతో సంబంధం లేకుండా రెండు వారాల ముందుగానే అంచనాలు తయారు చేయొచ్చని తెలిపిన శాస్త్రవేత్తలు.. రుతుపవనాల తిరోగమనాన్ని కూడా వెల్లడించే విధానాన్ని తయారుచేసినట్టు ప్రకటించారు. జ్యూరిచ్ లో జరిగిన జియోసైన్స్ సదస్సులో ఈ విధానాన్ని వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: