ఒకప్పుడు విండోస్ కంప్యూటర్లకి మాత్రమే వైరస్‌ల బెదడ ఎక్కువగా ఉండేది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎక్కువయ్యే కొద్దీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వైరస్‌లకు అడ్డాగా మారింది. శక్తివంతమైన ఏంటీవైరస్ లేకపోతే స్క్రీన్‌పై యాడ్లు రావడం మొదలుకుని ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎందుకూ పనికిరాకుండా పోయేటంత ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపధ్యంలో ఆండ్రాయిడ్ కోసం లభిస్తున్న 5 మెరుగైన ఏంటీవైరస్‌లను తెలుసుకుందాం.

1. Avast Mobile Security

ప్రముఖ ఏంటీవైరస్ సంస్థ Avastచే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం తయారు చెయ్యబడిన ఏంటీవైరస్  ప్రోగ్రామ్ ఇది. గతంలో ఈ యాప్ Free, Paid అనే రెండు వెర్షన్లుగా లభించేది. ప్రస్తుతం Paid వెర్షన్‌ని పూర్తిగా తొలగించి కేవలం Free వెర్షన్‌గా ఈ సాఫ్ట్‌వేర్‌ని Avast సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంటే అన్ని ఆప్షన్లనీ ఉచితంగానే పొందొచ్చన్నమాట. ఈ సాఫ్ట్‌వేర్ మాల్‌వేర్లని తొలగించడంతో పాటు ఫోన్లో దాగున్న ట్రోజాన్లని గుర్తించి నిర్వీర్యం చేస్తుంది. రియల్-టైమ్ ప్రొటెక్షన్‌ని కూడా అందిస్తోంది. ఏంటీవైరస్ సదుపాయాలతో పాటు అదనంగా వై-ఫై సెక్యూరిటీ లోపాలను గుర్తించే Wi-Fi vulnerability scanner, కాల్ బ్లాకింగ్ వంటి సదుపాయాలను కూడా అందిస్తోంది.

2. AVG Antivirus

ఆండ్రాయిడ్ యూజర్లు భారీగా వాడుతున్న మరో ప్రముఖ ఏంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇది. అయితే ఈ సాఫ్ట్‌వేర్ ఫ్రీ వెర్షన్‌లో కొన్ని పరిమితమైన సదుపాయాలను మాత్రమే అందిస్తోంది. Paid వెర్షన్‌ని నెలవారీ, లేదా ఏడాదికి సబ్‌స్కైబ్ చెయ్యడం ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు.

కేవలం వైరస్‌లు, ట్రోజాన్లని గుర్తించి తొలగించడమే కాకుండా ఇందులో లభించే Anti-Theft మోడ్ ఫోన్ దొంగతనం చెయ్యబడినప్పుడు మన ఫోన్‌ని ట్రాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.  అలాగే మొబైల్ డేటా వినియోగపు తీరుతెన్నులూ, బ్యాటరీ హెల్త్ ఎలా ఉందన్నది తెలియజేయడం, స్టోరేజ్ వివరాలు వంటివీ ఇది తెలియజేస్తుంది. పెయిడ్ ప్లాన్‌ని వాడుతున్న యూజర్లకి యాప్ లాకింగ్, యాప్ బ్యాకప్ వంటి అదనపు సదుపాయాలతో పాటు యాప్‌ని వాడేటప్పుడు యాడ్లు లేకుండా నీట్‌గా వాడుకోవచ్చు.

3. 360 Security

చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లు విరివిగానూ, సంతృప్తికరంగానూ వాడుతున్న ఏంటీవైరస్‌ యాప్ ఇది. ఫోన్లో వైరస్‌లను గుర్తించి తొలగించడంతో పాటు వృధాగా పేరుకుపోతున్న ఫైళ్లని గుర్తించి వాటిని తొలగించడం ద్వారా విలువైన స్టోరేజ్ స్పేస్‌ని ఆదా చెయ్యడం, మెమరీని ఉన్న ఫళంగా ఫ్రీ చేయడం, బ్యాటరీని సేవ్ చేసే ఆప్షన్లు, అప్లికేషన్లని లాక్ చెయ్యడం వంటి అనేక అదనపు ఆప్షన్లని ఇది అందిస్తోంది. ఈ యాప్ పూర్తిగా ఉచితం, ఏ విధంగానూ కొనాల్సిన అవసరం లేదు. వాడేటప్పుడు ఎలాంటి యాడ్లు కూడా చూపించదు.

4. CM Security


ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం పలు రకాల యాప్స్‌ని విడుదల చేసిన ప్రముఖ సంస్థ Cheetah Mobile చేత విడుదల చెయ్యబడిన ఏంటీవైరస్ ఇది. ఇది మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కి పూర్తి స్థాయి రక్షణ కల్పించడంతో పాటు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఇతర ఏంటీవైరస్ సదుపాయాలతో పాటు private browsing mode, app lock, intruder selfies, anti-theft, real-time protection వంటి సదుపాయాలను కూడా ఇది మనకు అందిస్తుంటుంది. పైన చెప్పుకున్న ఇతర యాప్స్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ స్టోరేజ్‌నీ, మెమరీని వినియోగించుకుంటుంది కూడా!

5. Kaspersky Internet Security


సెక్యూరిటీ రంగంలో చాలా పేరున్న సంస్థ నుండి లభిస్తున్న ఏంటీవైరస్ యాప్ ఇది. ఇది ఫ్రీ, Pro అనే రెండు వెర్షన్లుగా లభిస్తుంది. వైరస్‌లను గుర్తించే ఆప్షన్లతో పాటు Pro వెర్షన్‌లో ఫోన్ పోతే లొకేషన్‌ని ట్రాక్ చెయ్యడం, Privacy Mode, కాల్, మెసేజ్‌ల బ్లాకింగ్, Android Wear డివైజ్‌ల నుండి కంట్రోల్ చేసుకునే సదుపాయాలు లభిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: