మీకు తెలీని ఊరెళ్తున్నప్పుడు ఒకచోటి నుండి మరోచోటికి ఎలా వెళ్లాలో రూట్‌ని ఆల్రెడీ Google Mapsలో చూసేస్తున్నారు కదా. అదే విధంగా మీరు ఓ కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ పరిసరాలు, షాపులు, పెట్రోలు బంకులు వంటివన్నీ కళ్లకు కట్టినట్లు వ్యూ చూపించబడడానికి ఉద్దేశించబడిన Google Street Viewకి ఇండియా "నో" చెప్పేసింది. వివరాల్లోకి వెళితే..

భారతదేశం మొత్తాన్నీ స్ట్రీట్ వ్యూ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాలనుకున్న గూగుల్ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. వాస్తవానికి 2007వ సంవత్సరంలో Google Street View అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే దాదాపు అన్ని US నగరాలు స్ట్రీట్ వ్యూ ద్వారా స్పష్టంగా మనకు కన్పిస్తాయి.

అయితే ఇదే తరహా దృశ్యాలను భారతదేశంలోనూ గూగుల్ అందుబాటులోకి తీసుకు రావాలనుకుంది గానీ భారత ప్రభుత్వపు తాజా నిర్ణయంతో ఆ ప్రయత్నాలను ఆపేయవలసి వస్తోంది. స్ట్రీట్ వ్యూ అనేక రకాలుగా భారతదేశానికి ఉపయోగపడేదే అయినప్పటికీ భద్రతా కారణాల వల్ల భారత హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది.

దేశవ్యాప్తంగా ఉన్న పలు భద్రతా సంస్థలు Google Street View వల్ల వివిధ నగరాలు, ఆయా నగరాల్లోని ప్రతీ మూలపై ఉగ్రవాద ముఠాలకు అవగాహన ఏర్పడి వారు నేరుగా సందర్శించకపోయినా దేశం నలుమూలల్లో అనుకూలమైన ప్రదేశాలను ఎంచుకుని  ఉగ్రవాద దాడులకు పాల్పడవచ్చనే సందేహాలు హోం మంత్రిత్వ శాఖ వద్ద పెట్టిన నేపధ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.

పూర్తి స్థాయిలో అనుమతి లభించక ముందే గూగుల్ సంస్థ తాజ్‌ మహల్, ఎర్రకోట, కుతబ్ మీనార్, వారణాసి నదీ పరివాహక ప్రాంతం, నలందా విశ్వవిద్యాలయం, మైసూర్ పాలెస్, తంజావూరు దేవాలయం, చిన్నస్వామి స్టేడియం వంటి వివిధ ప్రముఖ ప్రదేశాలకు సంబంధించిన street view దృశ్యాలను సేకరించి ఇప్పటికే Google Maps ద్వారా అందిస్తోంది. ఈ సదుపాయాన్ని మిగతా అన్ని భారతీయ ప్రదేశాలకు విస్తరించాలనుకున్న గూగుల్ ప్రయత్నాలు ప్రస్తుతానికి ఆగినట్లే!


మరింత సమాచారం తెలుసుకోండి: