భారతీయ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజంకార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) సేవలను విస్తృతం చేసిన నేపథ్యంలో పర్యాటకులు, సామాన్య ప్రయాణికుల ఆదరణను పొందడంలో విజయం సాధించిందనే చెప్పవచ్చు. గతంలో రిజర్వేషన్ టికెట్ కోసం కిలోమీటర్లు లైన్లలో నిలబడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం అంతర్జాల సేవలను విస్తృతం చేయడంతో ప్రయాణికుల తిప్పలు తప్పినట్టైంది.  ఇక రైల్లో ఆహారం దారుణంగా ఉండేది. నాణ్యమైన ఆహారం లభించేదికాదు. తాజాగా రైల్వే శాఖ తీసుకొచ్చిన మార్పులతో ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని ఒక చరవాణి సందేశంతో రైలు వద్దకే తెప్పించుకుంటున్నారు. త్వరలోనే రైల్వే విశ్రాంతి గదుల నిర్వహణను కూడా ఈ సంస్థే చేపట్టనుంది. అలాగే కొత్తగా మరిన్ని పథకాలతో ఆదరణ పెంచుకునేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది ఐఆర్‌సీటీసీ.


రైలు ప్రయాణంలో ప్రయాణికులకు నచ్చిన ఆహారం కావాలంటే చరవాణి నుంచి ‘ ఎస్‌ఎంఎస్‌ మీల్‌ పీఎన్‌ఆర్‌’ అని టైప్‌ చేసి 139కి సందేశం పంపాలి. సంస్థ ప్రతినిధి ఫోన్‌ చేసి ఆర్డ్‌ర్‌ తీసుకుంటారు. రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌, నిరీక్షణ జాబితా టికెట్టు ఉన్న ప్రయాణికులు కూడా ఈ సేవలు పొందవచ్చు. నగదును ఏదైనా బ్యాంకు డెబిట్‌కార్డు, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జమ చేయొచ్చు లేదా రైలు వద్దకు వచ్చే హోటళ్ల సిబ్బందికి ఇవ్వొచ్చు. ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే రిజర్వేషన్‌ టికెట్లు సులువుగా పొందవచ్చు. ఏదైనా బ్యాంకు ఖాతా ఉన్న ప్రయాణికుడు తమ పేరు, ఫోన్‌ నెంబరు ద్వారా సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొత్తగా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. 


దీని ద్వారా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రిజర్వేషన్‌ టికెట్లు తీసుకోవచ్చు. సంస్థ నిర్దేశించిన నిర్ణీత సమయాల్లో తత్కాల్‌ టికెట్లు కూడా పొందవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం రద్దయితే రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాల వద్దకు వెళ్లకుండానే టికెట్లను రద్దు చేయడం, రిజర్వేషన్‌ కన్ఫర్మ్‌ అయిన రైలు వెళ్లిపోతే టీడీఆర్‌ ఫైల్‌ చేయడం ద్వారా నగదు వెనక్కి తీసుకోవడం కూడా చేయొచ్చు. రద్దయిన టికెట్టు డబ్బులు మూడు రోజుల వ్యవధిలో తమ బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. అన్ని ఆండ్రాయిడ్‌ చరవాణుల్లో ఐఆర్‌సీటీసీ కనెక్ట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు.



ఏయే వూళ్లు, స్టేషన్లు, ఏయే రైళ్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉందో సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రైలు స్టేషన్‌కు చేరుకునే రెండు గంటల ముందుగా చరవాణి సందేశం పంపాల్సి ఉంటుంది. ఆర్డర్‌ కన్ఫమ్‌ చేసుకుంటే రైలు సంబంధిత స్టేషన్‌కు చేరుకోగానే ఆయా హోటళ్ల సిబ్బంది బెర్తు వద్దకే వచ్చి ఆహారాన్ని అందిస్తారు. కనీస ఆర్డ్‌ర్‌ రూ.60 అయినా ఉండాలి. ఈ సేవలు అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలోని ఐఆర్‌సీటీసీ హోటళ్లతోపాటు బయట ప్రముఖ హోటళ్ల నుంచి కూడా ఆహార పదార్థాలు ఆర్డ్‌ర్‌ చేయొచ్చు. దీని కోసం ప్రత్యేక యాప్‌ కూడా రూపొందించారు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకొని సులువుగా బుక్‌ చేసుకోవచ్చు. సంస్థ టోల్‌ఫ్రీ నెంబరు 1323 ద్వారా కూడా సమస్త సమాచారాన్ని ప్రయాణికులు పొందవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: