ఏపిల్ ఐఫోన్ యూజర్లు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న iOS 10 కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఏపిల్ ప్రేమికులు కోరుకున్నట్లుగానే ఈ కొత్త వెర్షన్‌లో పలు సదుపాయాలను ఏపిల్ పొందుపరిచింది. ప్రస్తుతం Beta వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఫైనల్ వెర్షన్ సెప్టెంబర్‌లో  ఏపిల్ iPhone 7తో పాటు అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వెర్షన్లో చోటుచేసుకున్న కొన్ని మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం.

ఇక  Siri అన్ని చోట్లా

ఇంతకాలం ఏపిల్ స్వంత ప్రోగ్రాములను మాత్రమే కంట్రోల్ చేస్తూ వచ్చిన Siri వాయిస్ అసిస్టెంట్ ఇకపై ఇతర డెవలపర్లు విడుదల చేసిన iOS అప్లికేషన్లని కూడా కంట్రోల్ చెయ్యబోతోంది. ఈ మేరకు ఏపిల్ సంస్థ Siri SDK (Software Development Kit)ని విడుదల చేసింది.  ఈ SDKని వాడడం ద్వారా యాప్ డెవలపర్లు మనలాంటి యూజర్లు ఆయా యాప్స్‌ని వాయిస్‌తో కంట్రోల్ చేసుకునే సదుపాయాన్ని అందించగలుగుతారు.

iMessage మరింత శక్తివంతంగా

ఇంతకాలం iPhoneలలో లభిస్తున్న iMessage చాలా పరిమితమైన పనుల్ని మాత్రమే చేసి పెట్టేది. తాజాగా iMessage ద్వారా మనం ఎవరికైనా యూట్యూబ్ వీడియోలు, స్ట్రీమింగ్ మ్యూజిక్ లింకులను పంపించినప్పుడు వారు ప్రత్యేకంగా బ్రౌజర్‌ని ఓపెన్ చెయ్యాల్సిన పనిలేకుండానే iMessage యా‌ప్‌లోనే ఆ వీడియోలు ప్లే అయ్యే అవకాశం కలుగుతోంది. అలాగే మునుపటికన్నా emojiలు మూడు రెట్లు ఎక్కువ లభిస్తున్నాయి. మీరు iMessageలో టైప్ చేసిన సమాచారానికి అదనపు ఎఫెక్టులు జతచెయ్యడం ద్వారా ఆ textని పెద్దదిగా చేయొచ్చు లేదా చిన్నదిగా చేయొచ్చు.. పంపిన మెసేజ్‌ని బ్లర్ అయ్యే విధంగా చేయొచ్చు. iMessage ద్వారా మీ మిత్రులకు డబ్బు పంపొచ్చు. ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు, ఇలా ఎన్నెన్నో అదనపు పనులు iOS 10లోని iMessage యాప్‌తో సాధ్యపడతాయి.

Apple Music యాప్‌లో మార్పులు

Apple Music అప్లికేషన్లో కూడా కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. డౌన్‌లోడ్ చేసుకున్న మ్యూజిక్ కోసం కొత్త టాబ్ ప్రవేశపెట్టబడింది. "For you" అనే సెక్షన్ ద్వారా మీరు ఇష్టపడతారనుకున్న మ్యూజిక్‌ని యాపిల్ ప్రతీరోజూ మీ దృష్టికి తీసుకు వస్తుంది.

Google Photosలో మాదిరిగా

మీరు ఇప్పటికే Google Photosలో మీ ఫొటోలను అప్‌లోడ్ చేస్తుంటే, మన ఫొటోల్ని గూగుల్ ఫేస్‌ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా, అవి షూట్ చేసిన లొకేషన్ ఆధారంగా చేసుకుని, డేట్‌ని ఆధారంగా చేసుకుని ఫొటో collageలు తయారు చెయ్యడం మొదలుకుని అనేక పనుల్ని ఆటోమేటిక్‌గా చేసి పెడుతుంది కదా? అయితే ఇవన్నీ గూగుల్ క్లౌడ్ సర్వర్‌లో చోటు చేసుకుంటూ ఉంటాయి. iOS 10లోని Photos యాప్ ఇప్పుడు సరిగ్గా అవే పనుల్ని క్లౌడ్‌తో సంబంధం లేకుండా మన ఫోన్లోనే చేసేస్తుంది.

టైపింగ్ సమయంలోనూ

"మీరెక్కడ ఉన్నారు" అని ఎవరైనా మనల్ని అడిగారనుకోండి. మనం ఆన్సర్ టైప్ చేసేటప్పుడే iOS 10లోని Siri మనం ప్రస్తుతం ఉన్న లొకేషన్‌ని గుర్తించి మనకు టైప్ చెయ్యవలసిన పదం గురించి సజెషన్లు ఇస్తుంది. ఉదా.కు.. మీరు అమీర్ పేటలో ఉంటే Ameerpet అనే పదం దానంతట అదే టైపింగ్ సజెషన్లలో చూపించబడుతుంది. పైన చెప్పుకున్న మార్పులతో పాటు Apple News యాప్ కూడా రీడిజైన్ చెయ్యబడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: