ఈ అనంత విశ్వంలో ఎన్నో ప్రశ్నలు.. ఎన్నో అంతుచిక్కని రహస్యాలు.. మనిషి తన సాంకేతికతతో వీటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో మరో గొప్ప ముందడుగు పడిది. భూమికి వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రహానికి మనిషి ఉప గ్రహం పంపడం అంత సులభమైన విషయమేమీ కాదు.. 

తాజాగా నాసా సాధించిన విజయమిది.. మరి ఈ జునో విజయంతో ఏం తెలుస్తుంది.. మనిషికి ఏంటి లాభం ఓసారి తెలుసుకుందాం.. గురు గ్రహం ఆవిర్భావం, పరిణామక్రమం, రహస్యాల్ని శోధించేందుకు నాసా ఈ జునోను ప్రయోగించింది. గురుడి మూలాలు, అంతర్గత నిర్మాణం, అక్కడి  వాతావరణం తదితర అంశాల్ని జూనో శోధించనుంది. దీని ద్వారా.. సౌర కుటుంబ చరిత్రను తెలుసుకునే, ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలను అర్థం చేసుకునే అవకాశం ఏర్పడతుంది. 


గురు గ్రహం వాయు గోళంలా ఉన్నప్పటికీ.. దాని మధ్య భాగంలో శిలామయ కోర్‌ ఉందని భావిస్తున్నారు. ఇందులోని నిజానిజాలను జునో శోధిస్తుంది. గురుగ్రహంలోని మేఘాల కిందకు వెళ్లి.. సూక్ష్మ తరంగ ఉద్గారాలను కొలుస్తుంది. గురుత్వాకర్షణ, అయస్కాంత క్షేత్రాలు, రేడియోధార్మిక వలయాలపై అధ్యయనం చేస్తుంది. 

ఈ జునో గురుగ్రహం పై నీటిజాడలేమైనా ఉన్నాయేమో అన్వేషిస్తుంది. పరిశోధనల కోసం జునోలో మొత్తం 9 సైన్స్‌ పరికరాలు ఉన్నాయి. రేడియోధార్మికత, శీతల ఉష్ణోగ్రత, శక్తిమంతమైన రేణువుల తాకిడిని తట్టుకోవడానికి వాటన్నిటినీ టైటానియం కవచాల్లో ఉంచారు. 170 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి గురు గ్రహ కక్ష్యలోకి చేరిన జునో... తదుపరి 20నెలల్లో 37 సార్లు గురు గ్రహాన్ని చుట్టివస్తుంది. గురుడి ధ్రువ ప్రాంతాల్లోని.. రంగురంగుల అరోరాల విశేషాలు తెలుసుకుంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: